క్రికెట్ ఆడే దేశాల్లో మన దేశ ప్రజల్లో ఆ ఆటపట్ల ఉన్నంత పిచ్చి అభిమానం మరే ఇతర దేశంలో కూడా ఉండదని అంతా అంటూ ఉంటారు. అందుకే భారత్ ఏ దేశంతో క్రికెట్ ఆడుతూ ఉన్నా సరే.. దాని తాలూకు మార్కెటింగ్ టీవీ ఛానెళ్లకు చాలా పెద్దస్థాయిలోనే ఉంటుంది. పైగా ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెట్ కమిటీలతో పోల్చుకుంటే.. బీసీసీఐ అత్యంత సంపన్నమైన క్రికెట్ కౌన్సిల్. అంత రిచ్ అయిన బీసీసీఐ కూడా దడ పుట్టించిన డీల్ ఇది. భారత జట్టుకు పేస్ బౌలింగ్ కోచ్ ఒకరిని ప్రత్యేకంగా నియమించాలని జట్టు అనుకున్న నేపథ్యంలో.. బీసీసీఐ కు షాక్ కలిగే రీతిలో జహీర్ ఖాన్ వారికి తన రేటు ఆఫర్ చెప్పాడుట. దాంతో బీసీసీఐ అసలు ఆ ప్రతిపాదననే మానుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జహీర్ ఖాన్ .. ఒక పీరియడ్ లో భారతీయ క్రికెట్ పేస్ బౌలింగ్ ను శాసించిన బౌలర్. రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు మాత్రం ఆడుతున్నాడు. తతిమ్మా ఖాళీగా ఉన్నట్లే లెక్క. ప్రోడక్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే సీజన్ కూడా అయిపోయింది.
ఇలాంటి నేపథ్యంలో.. భారతీయ క్రికెట్ జట్టుకు పేస్ బౌలింగ్ కోచ్ ను విడిగా నియమిస్తే బాగుంటుందని మేనేజర్ అనిల్ కుంబ్లే భావించారుట. ఆయన ప్రతిపాదన మేరకు బీసీసీఐ తరఫునుంచి జహీర్ ఖాన్ ను ఓ భారీ ఆఫర్ తోనే సంప్రదించారుట. అయితే జహీర్ మాత్రం.. తనకు ఏడాదికి నాలుగు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కావాలని, ఏడాదిలో మూడు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటానని బీసీసీఐకు కండిషన్లు పెట్టారుట. మూడు నెలల కోచింగ్ కు నాలుగు కోట్ల రూపాయలు అనేసరికి బీసీసీఐకు కంగారెత్తి ఆ ఆలోచన మానుకున్నారుట.
అయినా జహీర్ ఖాన్ మరీ అంత కాస్ట్ లీనా అని పలువురు విస్తుపోతున్నారు. కాంట్రాక్టు కుదిరితే మాత్రం.. జట్టుకు కోచ్ గా అవకాశం లభించడం నా అదృష్టం అంటారు. రేటు దగ్గర తేడా వస్తే మాత్రం.. ఆ అవకాశాన్ని కాలదన్నేస్తారు అని పలువురు అనుకుంటున్నారు.