జనానికి అలా చెప్పమంటున్న చంద్రబాబు!

Update: 2016-09-22 13:38 GMT

ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజల్లో రేగుతున్న వ్యతిరేకత, జ్వలిస్తున్న ఆగ్రహావేశాలు అన్నీ క్రమంగా చప్పబడిపోతున్నాయా? కనీసం జనం ఆలోచనలు అదే అంశం చుట్టూ పరిభ్రమించకుండా.. మధ్యలో వచ్చిన ఈ వర్షాల వంటి విపత్తులు కూడా చంద్రబాబుకు మేలు చేస్తున్నాయా? ఏది ఏమైనప్పటికీ.. జనంలో హోదా గురించిన ఇదివరకటి ‘మూడ్’ ఇప్పుడు లేదనేది నిజం. దానికంటె ప్యాకేజీ గొప్పదని సుజనాచౌదరి , వెంకయ్యనాయుడు, చంద్రబాబు వంటి వారంతా కలిసి బీభత్సంగా ప్రచారం చేసి జనాల్ని ఎంత మేర నమ్మించారో తెలియదు గానీ.. మొత్తానికి వారిలో హోదా మీద ఉన్న ఆశను మాత్రం చంపేశారు.

ఇప్పుడు తాజాగా చంద్రబాబునాయుడు పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలోనూ.. ప్యాకేజీకి ప్రచారకర్తలుగా పనిచేయాలన్నట్లుగా వారికి పురమాయించడం విశేషం. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో వారికి ఇదే సంగతి చెప్పారు. ప్యాకేజీ చాలా గొప్పది అనే సంగతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తల మీదనే ఉందని చంద్రబాబు పురమాయించడం విశేషం. రాష్ట్రంలో ప్రస్తుతం భాజపా కూడా అదే పని మీద ఉంది. వారు ఒకవైపు.. తమ పార్టీ మీదకు ఎలాంటి నిందలు రాకుండా ఉండేలా.. అదేపనిగా ప్యాకేజీ సూపరంటూ ప్రచారం చేసే పనిలో ఉన్నారు. భాజపా మీద ఎటూ ఆశలు లేవు.. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే.. ఆ విషయంలో వెనక్కు తగ్గే మాటే లేదు అంటూ మొన్నటిదాకా చెప్పిన చంద్రబాబు ఏదైనా మాయ చేస్తారేమో అని ప్రజల్లో ఏమూల అయినా కాస్త ఆశ ఉంటే, దాన్ని కూడా ఇక మరచిపోవచ్చునని జనం అనుకుంటున్నారు.

Similar News