ఇల్లు కాలి ఒకడేడుస్తోంటే.. మరొకడొచ్చి చుట్టకు నిప్పు అడిగాట్ట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా వ్యవహరిస్తున్న తీరు కూడా అచ్చం ఈ సామెత లాగానే కనిపిస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో వరదలు.. ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లో జన జీవితాన్ని అతలాకుతలం చేసేస్తోంటే.. ఈ వానలను కూడా వైకాపాను దుమ్మెత్తిపోయడానికే ఆయన వాడుకోవడం మరీ స్థాయికి తగ్గట్లుగా లేదని జనం అనుకుంటున్నారు.
గుంటూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలకు జనజీవనం ప్రమాదకర పరిస్థితులకు చేరుకుంటోంది. క్రిష్ణా జిల్లాలో అంత తీవ్రత లేకపోయినా.. వర్షాలు , నదిలో నీటి ప్రవాహం ఎక్కువగానే ఉన్నాయి. అయితే ప్రభుత్వంలో ఉన్న బాధ్యతగల మంత్రిగా ఇలాంటి సమయంలో సహాయక చర్యల గురించి, చెరువులు గట్రా దెబ్బతినకుండా చూసేలా అధికార్లను పురమాయించడం గురించి నీటి పారుదల శాఖ మంత్రి పట్టించుకోవాలని ఎవరైనా ఆశిస్తారు.
అయితే ఉమా మాత్రం.. ఈ వర్షాలతో వైకాపా ప్రచారానికి విలువ లేకుండా పోయిందని మురిసిపోతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు రావని వైకాపా గతంలో ఆరోపణలు చేసిందిట. ఈ వానల దెబ్బకు ఆ ఆరోపణలు నీరుగారినట్లే నని ఉమా కు మహా సంతోషంగా ఉన్నట్లుంది. అయినా ఈ విడత చంద్రబాబు గద్దె ఎక్కిన తర్వాత.. ఇవి తొలిసారిగా కురుస్తున్న వర్షాలేం కాదు. కాకపోతే.. వర్షాలు వచ్చినందుకు చంద్రబాబు లెగ్ మంచిదని అనుకోవాలన్నట్లుగా ఉమా అంటున్నారు, మరి ఆయన గద్దె ఎక్కగానే వచ్చిన హుద్ హుద్ సంగతేమిటి? కాబట్టి.. ప్రక్రుతిని కూడా తమ రాజకీయ దెప్పిపొడుపులకు వాడుకునే ధోరణిని ఉమా వంటి వారు మానుకుంటే బాగుంటుందని జనం అనుకుంటున్నారు.