చిన్నమ్మా చిటికేయంగా.....!

Update: 2017-12-24 07:30 GMT

ముగ్గురు చిన్నమ్మలు.. ఒకరు సుష్మాస్వరాజ్ (విదేశీ వ్యవ‌హారాల శాఖ మంత్రి), ఇంకొక‌రు పురంధ‌రి (బీజేపీ మ‌హిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ), మ‌రొక‌రు శ‌శిక‌ళ (జ‌య‌ల‌లిత నెచ్చెలి) వీరంతా దేశ రాజ‌కీయాల్లో సుప‌రిచితులే.! ఎన్నో కీల‌క అవ‌రోధాలు న‌డుమ జ‌రిగిన ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితం శ‌శిక‌ళ వ‌ర్గానికి అనుకూలంగా వ‌స్తున్న నేప‌థ్యంలో, దిన‌క‌రన్ అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థుల‌ను చిత్తుగా ఓడిపోతున్న సంద‌ర్భంలో శశికళ జైలు నుంచే చక్రం తిప్పారు. ఎన్ని కేసులు ఎదుర్కొన్నా... జైలు కెళ్లొచ్చినా దినకరన్ నే అభ్యర్థిగా నిలబెట్టి మరీ పళని బ్యాచ్ కి సవాల్ విసిరారు. తన శపథాన్ని నెరవేర్చుకున్నారు.

అమ్మ మ‌ర‌ణం తరువాత....

త‌మిళ రాజ‌కీయాల్లో అనేకానేక మ‌లుపులు వ‌చ్చాయి. ప‌ళ‌నిస్వామి, ప‌న్నీరు సెల్వం మ‌ధ్య త‌గాదాలు తార‌సిల్లాయి. త‌రువాత స‌ద్దుమ‌ణిగాయి. ఈ త‌తంగంలో ప‌ళ‌ని స్వామి నెగ్గినా అంతిమ ఫ‌లితం ప‌న్నీరు వ‌ర్గానికే అనుకూలించింది. ఫ‌లితంగా పార్టీ నుంచి శ‌శి బ‌హిష్కృత నేత‌గా మిగిలిపోయింది. ఆమెతో పాటు ఇంకొంద‌రు కూడా! ఎన్నిక‌ల వేళ దిన‌క‌రన్ ఓ వీడియో విడుద‌ల చేసి సంచ‌ల‌నం సృష్టించ‌గా.. మ‌రికొన్ని భావోద్వేగాలూ ఆయ‌న‌కు క‌లిసివ‌చ్చి ఉండాలి. దీంతో ఆయ‌న గెలుపు దిశగా దూసుకుపోతున్నారు.ఐతే ఏమాట‌కు ఆ మాట ఈ ఫ‌లితంపై 2జీ స్పెక్ట్రం తీర్పు ప‌నిచేయ‌లేదు. రాజా అండ్ కో నిర్దోషులుగా పాటియాలా కోర్టు నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ప్పటికీ ఇదే స‌మ‌యాన ప్రజ‌ల మ‌న్ననను చూర‌గొన‌లేదు. ఇదొక్కటి ఊర‌టినిచ్చే అంశం.

అయ్యో పాపం అనుకున్నారు కానీ...

ఇక జ‌య‌మ్మ నెచ్చెలిగా రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్రవేసిన శ‌శిక‌ళ ఆమె మ‌ర‌ణానంత‌రం ఎన్నో క్యాంపు రాజ‌కీయాలు నెర‌పారు. మొత్తానికి కొన్ని అక్రమాస్తుల కేసుల్లోనూ, ఇంకొన్ని ఐటీ దాడుల్లోనూ ఆమె ఇరుక్కుపోయారు. ఇక్కడ కూడా కేంద్రం ద‌ర్యాప్తు సంస్థలను, ఆదాయ‌పు ప‌న్ను అధికారుల‌నే పావుగా వాడుకుంది. వాడుకుంటే వాడుకుంది..చిన్నమ్మకు మాత్రం ప‌ర‌ప్పర అగ్రహారంలో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంది కూడా..! ఆ మ‌ధ్య భ‌ర్తకు ఆరోగ్యం బాగాలేని కార‌ణంగా ఐదు రోజుల పే రోల్ పై వ‌చ్చిన‌ప్పటికీ, ఆ సంగ‌తి అటుంచి ఆమె కొన్ని కీల‌క స‌ర్దుబాట్లు చేసి తిరిగి కారాగారానికి వెళ్లిపోయారు. ఈ త‌రుణంలోనే ఆమె త‌న వ‌ర్గానికి కొన్ని సూచ‌న‌లు ఇచ్చిపోయి ఉంటారు. రాష్ట్రంలో సూట్ కేసు రాజ‌కీయాలు నెర‌పిన వ్యక్తిగా ఈమె ఉన్న పేరుని జ‌నం మ‌ర్చిపోయారో ఏమో కానీ దిన‌క‌ర‌న్ వైపు బాగానే మొగ్గు చూపారు. రౌండు రౌండుకీ ఆయ‌న ఆధిక్యం చూపారు.త‌న‌కిక తిరుగులేద‌ని నిరూపించుకున్నారు.మొత్తానికి పోరు అన్నాడీఎంకే మ‌ధుసూద‌న్‌కి, ఈయ‌న‌కే సాగింది. బీజేపీ కి నోటా క‌న్నా త‌క్కువ ఓట్లే పోలై క‌మ‌ల‌నాథుల‌ను నిశ్చేష్టుల‌ను చేసిందీ ఫ‌లితం. డీఎంకే అభ్యర్థి ఎన్ఎంగ‌ణేశ్ తొలి నుంచే వెనుకంజ‌లో ఉండి పెద్దగా త‌న స‌త్తా చూప‌లేక‌పోయి త‌న అస‌మ‌ర్థత చాటుకున్నారు. మొత్తం మీద చిన్నమ్మ జైలు నుంచే చిటికేసి మరీ తన మేనల్లుడిని గెలుపు దిశగా నడిపించి శపథం చాటుకుంది.

Similar News