పొరుగునే కర్ణాటక లోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఎంత పెద్ద బంగారు గనులో అందరికీ తెలుసు. ఇటు కడప జిల్లాలో వజ్రాల గనులు లభ్యత ఉన్నదనే విశ్వాసంతో చాలా కాలంగా అన్వేషణ శాస్త్రీయంగానే సాగుతూ ఉంది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో బంగారు గనులు ఉన్నాయనే ఫలితాలు కొత్త ఆశలు పుట్టిస్తున్నాయి. చిత్తూరు జిల్లా చిగురుకుంటలో బంగారం గని నిల్వలు ఉన్నాయనే ప్రాధమిక పరిశోధనలు చెబుతున్నాయి. ఈ గనులను వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం.
చిత్తూరు జిల్లా చిగురుకుంటలో బంగారుపంట పండనుందని అధికారులు అంటున్నారు.. ఇక్కడ బంగారం వనరులు లభిస్తున్నాయని జియోలాజికల్ డేటా తేటతెల్లం చేసినట్లుగా సమాచారం. ఇక్కడి భూముల్లో గనులు తవ్వుకోవడానికి వీలుగా వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరిలో వేలం నిర్వహించడానికి అధికారులు ముఖ్యమంత్రితో సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది.
అయితే ఇక్కడి చిగురుకుంట బంగారు గనుల స్థాయిని ఇంకా నిర్ధరించలేదు. ఇక్కడ దొరకగల బంగారం నిల్వల లభ్యత ఎంత, అందులో బంగారం నాణ్యత ఎంత? లాంటి కీలక వివరాలపై అవగాహన వస్తే తప్ప.. కంపెనీలు వేలంలో పాల్గొనవు. అలాంటి పూర్తి సాంకేతిక వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ నేపథ్యంలో ఖనిజ సంపద నాణ్యత, విలువ, మార్కెట్ ధర వంటివి అంచనా వేసేందుకు మైనింగ్ శాఖలో సాంకేతిక నిపుణులను, పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం వుందని ముఖ్యమంత్రి అధికార్లకు సూచించినట్లు సమాచారం. చిగురుకుంటలో బంగారం గనుల తవ్వకం ప్రారంభం అయితే గనుక.. అది చాలా పెద్ద సానుకూల అంశం అవుతుంది. ప్రభుత్వానికి రాబడి పరంగానే కాకుండా, స్థానికులకు ఉపాధి అవకాశాలు, ఇతర మార్గాల పరంగా కూడా ఎడ్వాంటేజీ అవుతుందని భావించవచ్చు.