కేంద్రప్రభుత్వం వైఖరిలో ఏ మాత్రం మార్పు వచ్చినట్లుగా కనిపించడం లేదు. జనం కష్టాలను పట్టించుకోవాలని, కష్టాలను దూరం చేసేలా.. నోట్ల రద్దును అమలు చేయాలని ప్రతిపక్షాలు ఎంతగా గోల చేస్తున్నప్పటికీ.. కేంద్రప్రభుత్వం అదే హడావుడి నిర్ణయాల వెల్లడి, హఠాత్తుగా షాక్ ఇవ్వడం అనే పోకడలనే అనుసరిస్తున్నది. 8వ తేదీ రాత్రి 500, 1000 నోట్ల రద్దును ప్రకటించి, అదే రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని మోదీ ప్రకటించి షాక్ ఇచ్చారు. అచ్చం అదే తరహాలో.. రద్దయిన నోట్లను బ్యాంకుల్లో ఇచ్చి కొత్త నోట్లు తీసుకునేలా మార్చుకోవడానికి ఇవాళ అర్ధరాత్రి వరకే గడువు అని కేంద్రం ఇప్పటికిప్పుడు ప్రకటించింది. వారి ప్రకటన మేరకు శుక్రవారం నుంచి ఇక దేశంలో బ్యాంకుల ద్వారా నోట్ల మార్పిడి అనే పర్వం ఉండదు. మహా అయితే.. మన వద్ద ఉన్న రద్దయిన నోట్లను బ్యాంకు అకౌంట్లలో వేసి తర్వాత డ్రా చేసుకోవడం ఒక్కటే మార్గం.
8వ తేదీనుంచి ఇవాళ్టి వరకు నోట్ల మార్పిడి కోసం జనం ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారో అందరికీ తెలిసిన సంగతే. అయితే ఏదో ఒకనాడు మార్పిడికి ఫుల్ స్టాప్ పెట్టి, కేవలం బ్యాంకు డిపాజిట్లను మాత్రమే అనుమతించే పద్ధతి రాక తప్పదు. కాకపోతే.. రాత్రి 7 గంటలకు నిర్ణయాన్ని ప్రకటించి.. అదే రోజు అర్ధరాత్రి వరకు మాత్రమే గడువు అని ప్రకటించడంలోని ఔచిత్యమే ప్రజలకు అర్థం కావడం లేదు. తొలుత డిసెంబరు 31 వరకు నోట్ల మార్పిడికి అవకాశం ఉంటుందని కేంద్రం ప్రకటించిన వైనాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు.
ఇప్పుడిక విధిగా అందరూ తమ తమ అకౌంట్లలో వేసుకోవడం ఒక్కటే మిగిలింది. కొత్తనోట్లు కావాలంటే కూడా ఉన్న నోట్లను అకౌంట్లలో వేసుకుని, ఆ తర్వాత విత్ డ్రా చేసుకోవాలి. ఈ పద్ధతి గురించి ప్రజలు విమర్శించడం లేదు గానీ.. హఠాత్తుగా ప్రకటించడమే చికాకు పెడుతుందని అనుకుంటున్నారు.