పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాస్థాయి కార్యవర్గ పదవుల కోసం కూడా చాలా పోటీ ఉంటుంది. ప్రజాప్రతినిధులుగా లేని, చాలా కారణాల వల్ల అవకాశం రాని రకరకాల వ్యక్తులు ఈ జిల్లా కార్యవర్గ పదవులను దక్కించుకోవాలని చూస్తుంటారు. అంత ఒత్తిళ్లలోనూ కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి 51 శాతం పదవులు కేటాయించాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించడం శెభాష్ అనదగిన నిర్ణయమే. వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని నాయకులుగా తీర్చిదిద్దడానికి ఇలాంటి కసరత్తు బాగా ఉపయోగపడుతుంది. అందుకే శెభాష్ అని తీరాలి. కానీ... ’వెనుకబడిన’ వర్గాల వారిని ఎంచుకోవడానికి కేసీఆర్ వద్ద ఉన్న తూకం రాళ్లు ఏమిటి. అనేది ఇక్కడ చాలా కీలకంగా ఉంది. ఈ విషయంలోనే ఆయన తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
వెనుకబడిన వర్గాలనుంచి జిల్లా కార్యవర్గాలకు నాయకులను ఎంచుకోవడంలో రెండు పద్ధతులు ఉన్నాయి. నిజంగా వెనుకబడిన, ఆర్థికంగా కూడా వెనుకబడిన, కానీ నాయకత్వ లక్షణాలు ఉన్న, తెలంగాణ కోసం తపన ఉన్న వారిని ఎంచుకుని వారి చేతిలో పార్టీని నడిపించే బాధ్యతలను పెట్టి, తీర్చిదిద్దడం ఒక పద్ధతి. రిజర్వేషన్ సిస్టమ్ లాగా లెక్కకోసం ఇన్ని పదవులు వెనుకబడిన వాళ్లకు ఇచ్చాం.. మమ్మల్ని మించి వెనుకబడ్డ వర్గాలను పట్టించుకునే వాళ్లు ఎవరూ లేరు అని చెప్పుకుంటూ.. ఆ కులాల కోటాలో ఉద్యమ నేపథ్యం, పార్టీ పట్ల అంకితభావం కాకుండా, సంపదలతో తులతూగడం ఒక్కటే కొలబద్ధగా ఎంపిక చేయడం మరో పద్ధతి.
ఈ రెండు పద్ధతుల్లో కేసీఆర్ దేనిని అనుసరిస్తారనేదాన్ని బట్టి.. పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కమిట్‌మెంట్ అనేది క్రైటీరియా కాకుండా ఒత్తిళ్లకు ప్రలోభాలకు లొంగి పార్టీ పదవులను కట్టబెట్టేస్తే గనుక.. ఇప్పటికిప్పుడు తాత్కాలిక ఫలితాలు బాగానే కనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో పార్టీకి చేటు జరుగుతుంది.