Tirumala : నేడు తిరుమలకు వెళ్లే వారికి అలెర్ట్.. ఎన్ని కిలోమీటర్ల క్యూ లైన్ అంటే?

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది

Update: 2025-12-24 02:55 GMT

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో కొండ భక్తులతో కిటకటలాడుతుంది. ఎక్కడ చూసినా భక్తులే. గోవింద నామ స్మరణలతో తిరువీధులు మారుమోగిపోతున్నాయి. నిన్న ప్రారంభమయిన రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. తిరుమలకు గత రెండు రోజుల నుంచి భక్తుల రాక మొదలు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ లో ఉన్న వారితో పాటు దర్శనానికి వచ్చే వారికి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

శ్రీవారి సేవకులతో...
తిరుమలకు రెండు రోజుల నుంచి కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్ కిలోమీటర్ల మేర బయట వరకూ విస్తరించి ఉంది. దీంతో శ్రీవారి సేవకులు క్యూ లైన్ లో ఉన్న వారికి అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. క్యూ లైన్ లలో దాదాపు పన్నెండు చోట్ల అన్న ప్రసాదం కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దర్శనం ఆలస్యమయినా భక్తులు ఆకలితో ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలో నేడు వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగానే ఉంది.
అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీహెచ్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించి ఉంది. దాదాపు రెండు కిలోమీటర్ల లైన్ బయటకు ఉంది. సర్వదర్శనం క్యూలైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 61,583 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 28,936 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.25 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News