Cold Waves : చలి చంపేస్తుంది కదయ్యా.. వణుకు వదలనంటుందే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలితీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది

Update: 2025-12-24 04:06 GMT

దేశంలో చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తర భారతదేశంతో పోటీగా దక్షిణ భారత దేశంలోనూ చలిగాలుల తీవ్రత ఈ ఏడాది ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో దక్షిణాదిన ఇంత కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. అయితే భారత వాతావరణ శాఖ ఈ ఏడాది చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ముందుగానే హెచ్చరికలు జారీచేసింది. ఆ హెచ్చరికలు తగినట్లుగానే గత ఇరవై రోజుల నుంచి చలితో దక్షిణాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. చెమట పట్టడం లేదు. అలాగే చలి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. దక్షిణాదిలోని అన్ని ప్రాంతాల్లో చలికి గజగజ వణుకుతున్నాయి.

ఏపీలోనూ అన్ని ప్రాంతాల్లో...
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ భిన్నమైన వాతావరణం ఉంటుంది. అటువంటి వాతావరణం ఒక్కసారిగా కూల్ అయిపోయింది. మొంథా, దిత్వా తుపానుల తర్వాత వరస అల్పపీడనాలతో చలితీవ్రత మరింత పెరిగింది. తుపానులు, అల్పపీడనాలు తగ్గాయని భావిస్తున్న తరుణంలో చలిగాలులు చంపేస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాలతో పాటు రాయలసీమలోనూ, కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట కూడా చలిగాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ లో స్వెట్టర్లు, రగ్గులు అంటే తెలియని చోట కూడా ఇప్పుడు అవి దర్శనమిస్తున్నాయి. ఇక అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోత్రలు నమోదవుతున్నాయి. అరకులో ఆరు, మినుములూరు ఎనిమిది, పాడేరులో పది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక పొగమంచు వదలడం లేదు.
చేతులు కొంకర్లు పోతున్నాయ్...
తెలంగాణలోనూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. చలికి చేతులు కొంకర్లు పోతున్నాయి. వృద్ధులు, చిన్నారులు, ఆస్మా సంబంధిత వ్యాధిగ్రస్థులు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ నగరంలోనూ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, కుమ్రభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా చలిగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. సింగిల్ డిజిట్ ఎక్కువగా నమోదవుతున్నాయి. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదువుతున్నాయి. ప్రజలు అవసరమైతే తప్ప చలిగాలులకు బయకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News