కుదుట పడ్తున్న హైదరాబాద్‌ : కేటీఆర్‌

Update: 2016-09-23 06:19 GMT

హైదరాబాద్‌ నగరం కొద్దికొద్దిగా కుదుట పడుతోంది. వర్షం అనుకున్నంత బీభత్సంగా లేకపోవడం .. కొన్నిరోజులుగా ఎదురౌతున్న అనుభవాల దృష్ట్యా తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు ఫలితమిస్తుండడంతో.. నగరజీవనం నెమ్మదిగా గాడిన పడుతోంది. ట్రాఫిక్‌ కష్టాలు కూడా దాదాపుగా ఒక కొలిక్కి వస్తున్నాయి.

మంత్రి కేటీఆర్‌ నిన్నటినుంచి నిరంతరాయంగా స్వయంగా దగ్గరుండి అన్ని విషయాలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలను ఫాలో అప్‌ చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యలు అన్నీ సవ్యంగా అందుతున్నాయని, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నదని కేటీఆర్‌ అంటున్నారు.

అదే సమయంలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని కూడా చెప్పారు. అన్ని ప్రాంతాల్లో అధికారులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని, ఈ వర్షాల దెబ్బకు అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అలాగే.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కూడా తదనుగుణమైన ఏర్పాట్ల గురించి చర్చిస్తున్నట్లు చెప్పారు.

హుసేన్‌ సాగర్‌ లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేశామని, నగరంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నమాట నిజమేనని కేటీఆర్‌ ఒప్పుకున్నారు.

మొత్తానికి నగరంలో జనజీవనం నెమ్మదిగా సాధారణంగా తయారవుతోంది. శుక్రవారం నగరంలో పాఠశాలలు అన్నీ సెలవులు ప్రకటించారు. నిన్నటి అనుభవాల దృష్ట్యా అత్యవసర పనులుంటే తప్ప బయటకు రాకుండా ప్రజలు కూడా పరిమితులు పాటించడంతో పరిస్థితి కుదుటపడుతోంది.

Similar News