తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలకు క్రేజ్ పెరుగుతూ ఉన్నట్లుంది. ప్రజలకు తొందరగా రీచ్ కావడానికి పాదయాత్ర ఒక ఉత్తమ మార్గం అని నాయకులు భావిస్తున్నారో ఏమో అర్థం కావడం లేదు. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా తాను ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. అనంతపురం జిల్లా గుత్తిలో పవన్ కల్యాణ్ శుక్రవారం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక విషయాలను వారితో చర్చించారు.
అమ్మాయిల భద్రతకు జనసేన పార్టీ అగ్ర ప్రాధాన్యం ఇస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. తాను ఆరోతరగతి చదువుతున్నప్పుడు తన అక్కను ఏడిపించిన మరో కుర్రాణ్ని చంపేయాలని అనుకున్నానంటూ పవన్ కల్యాణ్ చిన్ననాటి ఆవేశాన్ని గుర్తు చేసుకున్నారు.
నేతల్లో పాదయాత్రల మేనియా
పాదయాత్రల మీద రాజకీయ నాయకుల్లో చాలా మక్కువ పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లో 2004 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర అప్పట్లో పెద్ద సంచలనం. తర్వాత గత ఎన్నికలకు కొన్ని నెలల ముందు చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర నిర్వహించారు. వైఎస్ జగన్ జైల్లో ఉండగా, షర్మిల పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు చేపడుతున్న ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతున్నదంటూ.. కాంగ్రెస్ పార్టీ వారు చిన్న చిన్న పాదయాత్రలు అనేకం చేశారు. ఇటీవల తమ్మినేని వీరభద్రం మహా పాదయాత్ర నిర్వహించారు. తాజా పరిణామాల్లో ఇటీవల ప్రత్యేకహోదా కోసం విశాఖపట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన వైఎస్ జగన్ కూడా.. హోదా గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పాదయాత్ర ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర చేస్తానంటూ పవన్ కల్యాణ్ ప్రకటించడం యాదృచ్ఛికమే కావొచ్చు.