ఈ దేశాన్నే కుదిపేస్తున పెద్ద నోట్ల రద్దు, తత్పర్యవసానంగా జనం ఎదుర్కొంటున్న విపరీతమైన కష్టాల గురించి వైఎస్ జగన్మోహనరెడ్డి కనీసం పెదవి విప్పలేదు. 8వ తేదీ మోదీ కీలక నిర్ణయం వెలువరించిన తరువాత.. ఇప్పటిదాకా ఆ వ్యవహారంపై కనీసం తన అభిప్రాయాన్ని చెప్పని ఏకైక నాయకుడు అయిన వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం నాడు తూర్పుగోదావరి జిల్లా దానవాయి పేట వద్ద ఏర్పాటు అవుతున్న దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. ఈ పర్యటనలో జగన్ చాలా వ్యూహాత్మకంగా.. కేవలం దివీస్ పరిశ్రమ అంశానికి మాత్రమే పరిమితమై... నోట్ల అంశం గురించి పల్లెత్తు మాట అయినా ప్రస్తావించకపోవడం విశేషం.
దివీస్ విషయంలో మాత్రం ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా, వారి మీద కేసులు పెడుతూ ప్రభుత్వం మొండిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దివీస్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో 25 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న, దేశవ్యాప్తంగా రొయ్యల పరిశ్రమకు సీడ్ అందిస్తున్న హేచరీలు మొత్తం సర్వనాశనం అయిపోతాయని, ఈ ప్రాంత సామాజిక వ్యవస్థ మొత్తం నాశనం అవుతుందని, అందుకే స్థానికులు అంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా.. పోలీసు చర్యల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో ముందుకు వెళ్లాలనుకుంటే ఊరుకునేది లేదని జగన్ హెచ్చరించారు.
దివీస్ కు కేటాయింపుల్లో ఎకరా 5 లక్షలకే ఇస్తుండగా, 200 కోట్ల రూపాయల సొమ్ము అక్రమంగా చేతులు మారుతున్నదని జగన్ ఆరోపించారు. ఇక్కడికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఫార్మాసిటీలోనే దివీస్ ను కూడా ఏర్పాటుచేస్తే.. అక్కడ వ్యర్థాల శుద్ధి ప్లాంట్ లాంటివి అన్నీ ఉంటాయి గనుక.. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రజల మీద కేసులు పెట్టడం అన్యాయం అని జగన్ అంటున్నారు.
వీరి ఆందోళనలకు మద్దతిచ్చి, పాల్గొన్నందుకు తమ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం కేసులు పెట్టారని ప్రశ్నించిన జగన్.. అవసరమైతే తాను కూడా వారితో పాటూ ఉండి, తన మీద కూడా కేసులు పెట్టించుకుంటానని హెచ్చరించారు. ఏముంది మహా అయితే మరో 22 కేసులు పెడతారు. అంతే తప్ప.. దివీస్ ను మాత్రం ఇక్కడకు రానివ్వబోయేది లేదు అంటూ జగన్ స్థానికులకు మద్దతుగా చెప్పడం విశేషం.