విదేశీ పర్యాటకులు, విదేశాల్లో స్థిరపడిన భారతీయులు రాష్ట్ట్రానికి వచ్చినప్పుడు వారికి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సంస్థను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సీఎంఓలో పర్యాటక శాఖాధికారులు భేటీ అయినప్పుడు ఆయన పై విధంగా సూచించారు. వారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు శ్రీవారి దర్శనం ద్వారా మనోభీష్టం నెరవేర్చుకుని వెళ్లే విధంగా సహకరించాలన్నారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుతో మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించిన తర్వాత బౌద్ధ పర్యాటకుల సంఖ్య మెరుగుపడుతోందని, వీరికోసం బౌద్ధ స్థూపాలు, ఆరామాలు, చారిత్రక ప్రదేశాలతో బౌద్ధ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ‘ది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ’(ఐఏటీఓ) తో కలసి రాష్ట్ర టూర్ ఆపరేటర్స్ తో ఒక సమావేశం నిర్వహించాలన్నారు. ఐఏటీఓ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి ‘టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్’ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి రాష్ట్ర పర్యాటక అధికారులను కోరారు.
వీరిని సమన్వయం చేసుకుంటూ పర్యాటకులకు సదుపాయాల కల్పనలో ముందుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటక శాఖ అధికారులకు సూచించారు.
2017లో ఒడిషాలో ఐఏటీవో నేషనల్ కాన్ఫరెన్స్ జరుగనుందని, అందువల్ల ఐఏటీవో నేషనల్ కాన్ఫరెన్సును 2018లో మన రాష్ట్రంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఒకవేళ ఒడిషాలో 2017లో కాన్ఫరెన్స్ జరగని పక్షంలో మనరాష్ట్రంలో ఆతిథ్యమివ్వాలని కోరారు. ఐఏటీఏ కు ఒక్కో కాన్ఫరెన్స్ కు ఒక్కో ‘ఇతివృత్తం’ ఉందన్నారు. పర్యాటక నిర్వాహకులను రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లి, ఆయా ప్రాంతాల వైశిష్ట్యాన్ని, చారిత్రక ప్రాధాన్యాన్ని వివరించాలని కోరారు.
రాష్ట్రంలో పర్యాటక సంస్థలు, పర్యాటక గైడ్స్‌ను భాగస్వాములను చేస్తూ టూరిజం అండ్ హాస్పిటాలిటీ యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి అంతకు ముందు తనను కలసిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీఓ) అధ్యక్షుడు ప్రణబ్ సర్కార్, ఐఏటీఓ ఉపాధ్యక్షుడు రాజీవ్ మెహ్రాలతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిలో పర్యాటకాభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.