ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న బ్రేక్!

Update: 2016-11-01 06:10 GMT

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి ఒక బ్రేక్ పడింది. ఈ బ్రేక్ తాత్కాలికమైనదే కావొచ్చు. లేదా అలా బ్రేక్ గానే ఉండిపోవచ్చు. కాంగ్రెస్ నాయకుల ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారించిన హైకోర్టు.. సచివాలయ భవనాలను ఉన్నపళాన కూలగొట్టేయడం గురించి కౌంటర్ దాఖలు చేయాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించడం విశేషం. ఇందుకు ప్రభుత్వానికి పది రోజుల గడువు ఇస్తూ , తదుపరి విచారణను 10 రోజులు వాయిదా వేసింది.

వ్యాజ్యం విచారించిన సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూల్చివేతల గురించి నిర్ణయం తీసుకోవడం జరిగిందే తప్ప.. ఇంకా ఆదేశాలు జారీ కాలేదని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ చెప్పడం విశేషం. నిజానికి ఇది సర్కారును ఇరుకున పెడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఒకవైపు సచివాలయం నుంచి కార్యాలయాల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ఏ క్షణాన్నయినా కూల్చివేత కూడా జరగవచ్చునని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇవాళ కోర్టులో పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో కోర్టుకు నివేదించడానికి తెలంగాణ సర్కారు ఓ నోట్ కూడా తయారుచేసినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఈ సచివాలయంలో ఉన్న ప్రతిభవనమూ ఎంత ఘోరంగా ఉన్నాయో, ప్రతి బ్లాకులోనూ ఎన్నేసి లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ కూల్చివేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఎందుకు లేదో... వివరిస్తూ ఆ నోట్ తయారు చేసినట్లు వార్తలు వచ్చాయి.

అయితే పిటిషనర్ల వ్యాజ్యంలో మాత్రం కేవలం వాస్తుకారణాల వల్లనే కూలగొడుతున్నారని ఆరోపించారు. తనకు అనుకూలమైన వాస్తులేదనే కారణంతో.. కేసీఆర్ ఈ సచివాలయానికి రాకుండానే పాలన సాగిస్తున్నారని కూడా ఆరోపించారు. కొన్ని సంవత్సరాలుగా మంచిగా ఉపయోగపడుతున్న భవనాలను కేవలం వాస్తు వంటి విశ్వాసాల కారణంగా కూలగొట్టడం సబబు కాదంటూ అందులో పేర్కొన్నారు. ఈ వాస్తు విశ్వాసాల గురించి, పిటిషన్ లో ఆరోపణలు గురించి ప్రభుత్వం కౌంటర్ లో ఏం పేర్కొంటుందో చూడాలి.

Similar News