ఇ-కేవైసీ మస్ట్ : ఏపీలో క్షేత్రస్థాయిలో డిజిటల్ యుగం

Update: 2016-11-24 14:10 GMT

పరిపాలనలో ఒకవైపు డిజిటల్ యుగాన్ని ఆవిష్కరిస్తూ , ఆధునిక సాంకేతిక విప్లవంతో కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు వెళుతున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు.. నోటుదెబ్బకు ప్రజల ఆర్థిక లావాదేవీలు అన్నిటినీ డిజిటల్ మాధ్యంలోకి మార్చడానికి కసరత్తు చేస్తుండడం మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో అమలయ్యే అన్ని సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అన్నిటి వ్యవహారాలను డిజిటల్ తనిఖీల ద్వారానే ప్రజలకు ఖచ్చితంగా చేరేలా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఉభయతారకంగా, అవినీతికి అక్రమాలకు తావులేకుండా ఇ-కేవైసీ వంటి పద్ధతుల్ని తప్పనిసరిగా మార్చబోతున్నారు. ప్రజా సాధికార సర్వేపై గురువారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అనేక సూచనలు చేశారు.

ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల వినియోగంలో ఇకపై ఇ-కేవైసీని తప్పనిసరి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇ-కేవైసీ అనుసంధానం ద్వారా ప్రజా సాధికార సర్వేను సంపూర్ణం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సర్వేను పూర్తిచేయడానికి ఇంకా కొద్దిరోజులే గడువు వుందంటూ, ఈ స్వల్ప వ్యవధిలో సర్వేను మరింత సమగ్రంగా చేపట్టేందుకు ఆధార్, ఇ-కేవైసీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అన్ని మార్గాల ద్వారా ప్రయత్నించాలని చెప్పారు. విజయవాడలో పోలీస్ కమాండ్ కమ్యూనికేషన్స్ సెంటర్ నుంచి గురువారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజా సాధికార సర్వే జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు.

ప్రజాసాధికార సర్వే చివరి దశలో వున్నామని చెబుతూ, ఇప్పుడు కూడా అధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను ఆశించి ఈ సర్వేను చేపట్టామని, సర్వేలో వచ్చిన సమాచారం ఆధారంగా ఇకపై ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు లబ్దిదారులకు చేరతాయని చెప్పారు. ప్రజాసాధికార సర్వే డేటా ఆధారంగా ప్రణాళికల రూపకల్పన, పర్యవేక్షణ ప్రభుత్వానికి సులభతరం అవుతుందని తెలిపారు. ప్రభుత్వం అందించే ప్రతి ప్రయోజనాన్ని ఇకపై పరిశీలన జరపని ఏ ఒక్కరికీ ఇవ్వడం వీలు పడదని అన్నారు.

ఇటీవల కరెన్సీ రద్దు నిర్ణయం దరిమిలా ప్రజాసాధికార సర్వేకు ప్రాధాన్యం పెరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 4,16,03,559 మంది సర్వే పూర్తి చేసుకున్నారని అధికారులు వివరించారు. 1,36,63,753 ఇళ్లల్లో సర్వే పూర్తయిందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఈ సర్వేపై పడిందని పలువురు కలెక్టర్లు సీయం దృష్టికి తీసుకువచ్చారు. గడువు సమీపిస్తున్నా కొన్ని చోట్ల సర్వే సజావుగా సాగడం లేదని, ప్రధానంగా పట్టణ ప్రాంతాలలో సర్వే మందకొడిగా వున్నదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సర్వేలో చూపిన పనితీరు ఆధారంగానే ఉద్యోగులకు మున్ముందు పదోన్నతులు, బదిలీలు వుంటాయని చెప్పారు. సర్వీసులో వుండే ఉద్యోగులు ప్రభుత్వం అప్పజెప్పిన విధులను సంపూర్ణంగా పూర్తిచేయడం బాధ్యతగా గుర్తించాలని అన్నారు.

ప్రజా పంపిణీ నిత్యావసరాలు, పింఛన్లు, ఉపకార వేతనాలు పొందే లబ్దిదారుల ఇ-కేవైసీ డేటాను పరిశీలించి స్మార్ట్ సర్వే చేయించుకోని వారిని గుర్తించాలని ముఖ్యమంత్రి చెప్పారు. డ్రైవింగ్ లైసెన్సులు, ఆధార్ కార్డు సమాచారంతో సాధికార సర్వే డేటాను సరిపోల్చి చూడాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు వల్ల ఇబ్బందులు వస్తున్నట్టు గుర్తించామని, కొందరు రెండుచోట్లా సర్వేలో పాల్గొంటున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఇటువంటి వాటిని గుర్తించి డూప్లికేషన్ లేకుండా కచ్చితమైన సమాచారం రాబట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరికీ ఇ-కేవైసీ నమోదు చేయడం ఇకపై తప్పనిసరి చేయాలని నిర్దేశించారు.

తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సాధికార సర్వే పెండింగ్‌లో వున్నదని, అలాంటి చోట్ల అదనపు సిబ్బంది సేవలను వినియోగించుకుని ఎన్యూమరేషన్ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా సాధికార సర్వేను పూర్తిచేసి పోర్టల్‌ ద్వారా బహిర్గత పర్చాలని, పంచాయతి కార్యాలయాల్లో నోటీస్ బోర్డులలో వుంచాలని సూచించారు. వచ్చే నెల మొదటి వారంలో ప్రత్యేక కౌంటర్లు పెట్టి అప్పటికి సర్వే చేయించుకోని వారికి మరో అవకాశం ఇద్దామని చెప్పారు. మొత్తం మీద డిసెంబరు నెలాఖరులోగా మొత్తం ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. అప్పటి వరకు అందిన డేటాతో ‘పీపుల్స్ హబ్’ ఏర్పాటుచేస్తామని, దీనికి సమాంతరంగా ల్యాండ్ హబ్ కూడా ఏర్పాటు చేసి ఈ రెండింటి ఆధారంగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

Similar News