అమ్మ టెన్షన్‌ : హెల్త్‌ బులెటిన్‌ వస్తేగానీ చెప్పలేం..

Update: 2016-10-02 06:00 GMT

తమిళనాడు అంతటా పురట్చితలైవి జయలలిత ఆరోగ్యం గురించిన ఆందోళన , టెన్షన్‌ అనదగిన రేంజిలో కాదు.. హైటెన్షన్‌ అనదగిన రేంజిలో నడుస్తున్నది. రెండు రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అనేక భయాలు పుకార్లు వ్యాపిస్తుండగా, డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తున్నారని ధ్రువీకరించిన గవర్నరు విద్యాసాగర్‌ రావు ప్రకటన తప్ప ఇప్పటిదాకా మరొక వివరణ ఏదీ రాలేదు. ఇప్పటిదాకా ఆస్పత్రి వర్గాలు బులెటిన్‌ ఏదీ విడుదల చేయలేదు.

నిన్నటిదాకా జయలలిత ఆరోగ్యం గురించి బులెటిన్‌ విడుదల చేయాలని, ఫోటోలు విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. ఇవాళ పరిస్థితి మారింది. అన్నా డీఎంకే కార్యకర్తలే తమ నాయకురాలి ఆరోగ్యం గురించిన ఆందోళనలో ఇలాంటి డిమాండ్లకు దిగుతున్నారు.

చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద నిన్నటి కంటె ఎక్కువ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆస్పత్రిలో కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 24 మంది మంత్రులు, 8 మంది ఐఎఎస్‌ అధికారులు మాత్రం ఉన్నారు. అయితే అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అనేది మాత్రం తెలియడం లేదు. బయట నిరీక్షిస్తున్న వేల మంది అభిమానుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. జయలలిత ఆరోగ్యం గురించి హెల్త్‌ బులెటిన్‌ ఫోటోల సహా వస్తే తప్ప జనంలో ఆందోళన తగ్గదని అంతా అనుకుంటున్నారు.

Similar News