ఈ ప్రయత్నం పూర్తయితే గనుక అమరావతి నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మరో మేజర్ ముందడుగు పడినట్లే. అమరావతిలో ఒక అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు అమరావతి సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్, హైదరాబాదులోని కాన్సుల్ జనరల్ కాథరిన్ బి.హుడాకు విన్నవించారు. ఇందుకు వారు కూడా సుముఖంగానే ఉన్నట్లుగా ప్రాథమికంగా వెల్లడవుతున్న వార్తలను బట్టి తెలుస్తోంది.
అమరావతికి అమెరికన్ కాన్సులేట్ వచ్చినట్లయితే.. వీసాల పరంగా అమెరికా వెళ్లే ఏపీ వాసులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అయితే కేవలం అదొక్కటే కాకుండా.. బిజినెస్ ఛాంబర్ తో కలిసి అమరావతి నగరానికి అమెరికానుంచి పెట్టుబడులు తీసుకురావడానికి కూడా సహకరిస్తాం అంటూ.. కాథరిన్ బి.హుడా , అధికార్ల బృందానికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది.
అమరావతి అంతర్జాతీయ నగరంగా మారే ప్రక్రియలో అమెరికన్ కాన్సుల్ అనేది కూడా ఒక మైలురాయి వంటి దశ అవుతుందని.. దీనివలన ప్రజలు హైదరాబాదు, చెన్నయ్ వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండదని భావించవచ్చు.