ఏడాది కిందట ప్రధాని మోదీ కొట్టిన టెంకాయతో ఏం జరిగిందో... మొన్నటికి మొన్న అరుణ్ జైట్లీ కొట్టిన టెంకాయతో ఏం ఒరిగిందో.. రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ... వాస్తవంలో మాత్రం అమరావతి నగర నిర్మాణం ప్రస్తుతం మొదలైంది. నగరం నిర్మాణం జరగాలంటే.. ముందుగా రోడ్లు మరియు ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ నిర్మాణం జరిగితే తప్ప సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిన సంగతే. ఆ మేరకు , ముందుగా నగరం గురించి అనుకున్న ప్రణాళికకు తగినట్లుగా అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ రోడ్ల నిర్మాణం ముమ్మరంగా జరుగుతోంది. అదే సమయంలో అమరావతి నగరాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ప్రధాన రోడ్ల నిర్మాణానికి కూడా టెండర్లు పిలిచేశారు. అది రాగానే ఆ విడత పనులు కూడా మొదలైపోయే అవకాశం ఉంది.
అమరావతి నగరంలో కోర్ కేపిటల్ భవనాలకు మాత్రమే కేంద్రం పూర్తి ఖర్చును భరిస్తుంది. అలాగే.. ప్రపంచ బ్యాంకు, హడ్కో, ఆంధ్రా బ్యాంకు తదితర సంస్థలనుంచి రుణాలకు కూడా హామీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. కోర్ కేపిటల్ భవనాలు రావాలన్నా, మొదలు కావాలన్నా సరే.. మున్ముందుగా ఇన్ ఫ్రా స్ట్రక్చర్, రోడ్లు, డ్రైనేజీ, విద్యుదీకరణ, ఇతర కేబులింగ్ తదితర వ్యవస్థలు పూర్తయితే తప్ప... అడుగు ముందుకు వేయడం సాధ్యం కాదు. అందుకే ప్రాథమికంగా జరగాల్సిన రోడ్డు పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పనులు కొన్నిరోజులుగా చాలా చురుగ్గా జరుగుతున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నగర నిర్మాణానికి సంబంధించిన తొలిదశను, ఒక స్థాయి వరకు అయినా సరే.. 2018 సంవత్సరాంతానికి పూర్తిచేసి ప్రజల మన్నన చూరగొనాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది.