జయలలిత ఆరోగ్యం గురించి, ప్రస్తుత పరిస్థితి గురించి ఆమె అభిమానుల్లో ఆందోళన గంటగంటకు పెరుగుతోంది. చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్త రూపం దాలుస్తోంది. జనం గంటగంటకూ పెరుగుతుండడంతో పోలీసులు వారిని అదుపు చేయలేకపోతున్నారు.
ఒకవైపు అభిమానులు ఆస్పత్రి ఎదుట గుమ్మడికాయలు దిష్టి తీసి కొట్టి పూజలు చేస్తున్నారు. అదే సమయంలో కార్యకర్తలు అమ్మ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ తక్షణం చెప్పాలంటూ గొడవ చేస్తున్నారు. కొందరు కార్యకర్తలు ఆస్పత్రిలోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నిస్తుండడంతో... పరిస్థితి అదుపు తప్పుతోంది.
అమ్మ బాగుండాలంటూ ఆస్పత్రి బయట సర్వ మత ప్రార్థనలు జరుగుతున్నాయి. తమిళనాడులో రాజకీయంగా సామాన్య జనసందోహంలో వ్యక్తిపూజ ఊహకందని విధంగా ఉంటుంది. ఎంజీఆర్‌ను కూడా గతంలో అంతే వెర్రిగా జనం అభిమానించారు. అదే పోకడ ఇప్పుడు కూడా కనిపిస్తోంది. ఇప్పటికైనా జయలలిత ఆరోగ్యం గురించి అపోలో ఆస్పత్రి డాక్టర్లు తక్షణం ఓ బులెటిన్ విడుదల చేయాల్సి ఉందని పలువురు కోరుతున్నారు.