పార్టీలోని ముఠా తగాదాలు రచ్చకెక్కి పార్టీ పరువును, ప్రభుత్వం పరువును కూడా బజారు పాల్జేస్తున్న అనంత రాజకీయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. జిల్లాలో పరస్పరం తగాదాలు పడుతున్న నాయకుల మధ్య ఏకాభిప్రాయం సాధించడానికి ప్రయత్నించారు. ఆ ముఠాల్లోని నాయకులు ఒకరి అభిప్రాయాలతో మరొకరు రాజీపడే వైఖరి అన్నట్లుగా కాకుండా... ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకొంటే దానికి అందరూ కట్టుబడి ఉండాలంటూ నిర్దేశించడం ద్వారా చంద్రబాబునాయుడు అనంత తగాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అనంతపురంలో రోడ్ల విస్తరణ , దానికి అనుబంధంగా దుకాణాలు, నిర్మాణాలను తొలగించడం అనే వ్యవహారం చినికి చినికి గాలివానగా మారి.. అనంతపురం జిల్లాలోని తెలుగుదేశం వర్గాల తగాదాలను రచ్చకీడుస్తున్న సంగతి తెలిసిందే. లోకల్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ తదితరులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, చంద్రబాబునాయుడు సదుద్దేశంతో రోడ్ల విస్తరణకు నిధులు ఇస్తే పనులు సాగనివ్వడం లేదని ఆరోపిస్తూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఒకరోజు నిరశన దీక్ష చేసిన సంగతి తెలిసిందే.
దాని పర్యవసానంగా చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆయన ఎమ్మెల్యే ప్రభాకర చౌదరిని పిలిపించి.. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే దానికి నాయకులు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని సూచించినట్లుగా తెలుస్తోంది. సీఎంతో భేటీ అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ... జేసీ దివాకర్ రెడ్డి సీనియర్ నాయకుడు అని, ఆయనే అందరినీ కలుపుకుని పోవాలని వ్యాఖ్యానించారు. తాను ఎక్కడా దూకుడుగా వ్యవహరించలేదని ఆయన చెప్పారు.
అనంతపురం జిల్లా పార్టీలోని తగాదాలను పరిష్కరించడానికి చంద్రబాబునాయుడు ముగ్గురు సభ్యులతో ఒక త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీలో మంత్రులు నారాయణ, శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీ షరీఫ్ ఉంటారు. వీరు జిల్లా నాయకులతో మాట్లాడి తగాదాలు లేకుండా, పార్టీ నష్టపోయేలా ఎవరూ ప్రవర్తించకుండా చూసుకుంటారు. అనంతపురం జిల్లాలో తెదేపాలో ముఠా రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయంటూ తెలుగుపోస్ట్ ముందే ఓ కథనాన్ని అందించింది. అదే రోజున చంద్రబాబు ఈ చొరవ చూపించడం విశేషం.