భారత పాకిస్తాన్ దేశాల మధ్యలో ప్రస్తుతం యుద్ధమేఘాలు కమ్ముకుని ఉన్నాయి. ఉరీ ఉగ్రవాద దాడుల పర్యవసానంగా.. భారత్ సర్జికల్ దాడులను అనుభవించిన పాకిస్తాన్.. ఇప్పుడు సమయం కోసం చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇరు దేశాలు.. యుద్ధం కోసమే నిరీక్షిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. సరిహద్దులో ఉండే గ్రామాల్లో మామూలు ప్రజలను కూడా ప్రమాదాలను శంకించి ఖాళీ చేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరి సైన్యానికి మరొక దేశం వాసులు దొరికితే పరిస్థితి ఏమిటి?
ఇప్పుడు అలాంటి సంక్లిష్ట పరిస్థితి నెలకొని ఉంది. ఇవాళ గుజరాత్ తీరంలో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ మత్స్యకారుల పడవను భారత అధికారులు పట్టుకున్నారు. మత్స్యకారులుగా చెప్పుకుంటున్న 9 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అదే సమయంలో మన దేశానికి చెందిన ఓ సైనికుడు కూడా పాకిస్తాన్ భూభాగంలోకి పొరబాటుగా వెళ్లిపోయి.. అక్కడ వారి ఆధీనం లో ఉన్నారు. ఆ సైనికుడిని విడిపించడానికి హోంమంత్రి రంగంలోకి దిగి పాక్ అధికారులతో సంభాషిస్తున్నారు.
అటు పాక్ సేనల వద్ద మన సైనికుడు ఒకరు బందీగా ఉంటే, ఇక్కడ మన దేశంలో 9 మంది పాక్ మత్స్యకారులు బందీలుగా ఉన్నారు. హోం మంత్రి విన్నవిస్తున్నా ఆ సైనికుడిని రెండురోజులుగా విడిచిపెట్టని పాకిస్తాన్... ఇప్పుడు తమ మత్స్యకారుల కోసమైనా వదిలేస్తుందేమో చూడాలి.