టీడీపీకి బూస్ట్ ఇచ్చిన రఘురామ

వైసీపీ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు గత రెండున్నరేళ్ల నుంచి అసంతృప్తి నేతగానే కొనసాగుతున్నారు

Update: 2022-08-25 04:19 GMT

వైసీపీ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు గత రెండున్నరేళ్ల నుంచి అసంతృప్తి నేతగానే కొనసాగుతున్నారు. ఆయన రెండున్నరేళ్ల నుంచి తన సొంత నియోజకవర్గమైన నరసాపురానికి కూడా రాలేకపోతున్నారు. ఢిల్లీలోనే ఉండి రోజూ రచ్చబండ పేరుతో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆయన తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించినట్లు చెబుతున్నారు. అత్యధిక శాంపిల్స్ తో శాస్త్రీయంగా ఈ సర్వే నిర్వహించినట్లు రఘురామ కృష్ణరాజు చెబుతున్నారు. ఖచ్చితంగా వైసీపీ ఓటమి ఖాయమని, టీడీపీ గెలుపు తధ్యమని తన సర్వేలో వెల్లడయిందని ఆయన తెలిపారు.

నెలరోజుల్లో...
ఈ ఏడాది జూన్ నుంచి జులై మొదటి వరకు ఈ సర్వే నిర్వహించినట్లు ఆయన చెబుతున్నారు. తాను చేయించిన సర్వేలో 93 స్థానాలను ఖచ్చితంగా టీడీపీ గెలుచుకుంటుందని తేలిందన్నారు. ఇక టీడీపీ, వైసీపీకి మధ్య కీ ఫైట్ అనేక స్థానాల్లో ఉందని, అందులో సగం స్థానాల్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీకి 127 స్థానాలను సులువుగా గెలుచుకుంటుందని ఆయన చెప్పారు. వైసీపీకి కేవలం ఏడు నుంచి ఎనిమిది స్థానాల్లో మాత్రమే ఖచ్చితంగా గెలుస్తుదదన్నారు. కీ ఫైట్ ఉన్న స్థానాల్లో వైసీపీ 90 శాతం గెలిస్తే ఆ పార్టీ 73 స్థానాలకే పరిమితమవుతుందని రఘురామ కృష్ణరాజు తెలిపారు.
జిల్లాల వారీగా...
ఇక రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం జిల్లాలో టీడీపీ అధిక స్థానాలను సాధిస్తుందని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాలో టీడీపీ బాగా పుంజుకుందన్నారు. కడప జిల్లాలో మాత్రం వైసీపీ అత్యథిక స్థానాలను గెలుచుకుంటుందని, ఇక ఉభయ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన సర్వేలో తేలింది. ఏతావాతా రఘురామ కృష్ణరాజు చేయించిన సర్వేలో టీడీపీ విజయం ఖాయమని తేలిందని ఆయన చెబుతున్నారు. పథకాల పట్ల ప్రజలు సంతృప్తికరంగా లేరని, ఎక్కువ మంది ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని తన సర్వేలో తేలినట్లు ఆయన తెలిపారు. జనసేన, టీడీపీ కలిస్తే వార్ వన్ సైడ్ గా ఉంటుందని కూడా ఆయన చెప్పారు.
మరో లగడపాటి అంటూ...
ఇంతవరకూ బాగానే ఉన్నా రఘురామ కృష్ణరాజు సర్వే పట్ల సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. మరో లగడపాటి బయలుదేరాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మాజీ ఎంపీ లగడపాటి సర్వేలు ఒక విశ్వసనీయత ఉండేది. అయితే గత ఎన్నికల సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఆయన చేయించిన సర్వేలు ఫెయిల్ కావడంతో ఇకపై తాను సర్వేలు చేయించనని ఒట్టేసి చెప్పారు. రాజకీయాల నుంచే కాదు సర్వేల నుంచి కూడా సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు కూడా లగడపాటి బాటలోనే నడుస్తున్నారన్న సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
రాజీనామా చేయొచ్చుగా...
ఇంతకీ ఆయన నరసాపురం పార్లమెంటు స్థానం గురించి సర్వేలో ఏమొచ్చిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జాతీయ మీడియా సంస్థలయిన టైమ్స్ నౌ, ఇండియా టుడే, ఇండియా టీవీ ల సర్వేలకు పోటీగా టీడీపీని జాకీ పెట్టి లేపేందుకు రాజుగారు ఈ సొంత సర్వేలను బయటకు తెచ్చారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం రఘురామ కృష్ణరాజు నిర్వహించిన సర్వే మాత్రం టీడీపీ వర్గాల్లో కొంత బూస్ట్ నిచ్చిందనే చెప్పాలి. నిజంగా ఆయన చేసిన సర్వే నిజమయితే పార్లమెంటు సభ్యుడిగా ఎందుకు రాజీనామా చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలుస్తానన్న రఘురామ కృష్ణరాజు ఎందుకు వెనక్కు తగ్గారో చెప్పాలంటున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా ఈరోజు రాజీనామా చేయాలని ట్వీట్ చేశారు.


Tags:    

Similar News