YS Viveka : వైఎస్ వివేకా మృతి.. ఇక ఎన్నడూ వీడని మిస్టరీయేగా?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై ఇక ఏమీ తేలదు

Update: 2026-03-14 07:53 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై ఇక ఏమీ తేలదు. ఇప్పటికి ఇంతే. సీబీఐ కూడా సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ముగిసిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో కొత్తగా ఎవరినీ నిందితులుగా చేర్చలేదని, అదనపు ఆధారాలు లభించలేదని నివేదించింది. ట్రయల్ కోర్టు లో విచారణను వేగవంతం చేసి, నాలుగు వారాల్లోగా ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, ఈ కేసులో నిందితుల బెయిల్‌ను రద్దు చేయాలన్న విజ్ఞప్తులను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పోరాటం కూడా ముగిసినట్లేనని అనుకోవాలి. ఇక వైఎస్ వివేకా మృతిలో మిస్టరీ వీడే అవకాశం లేనట్లే కనిపిస్తుంది.

హత్యకు గల కారణాలు...
వైఎస్ వివేకా మృతి జరిగి ఏడేళ్లు కావస్తుంది. గొడ్డలి పోట్లు ఉండటంతో అది హత్య అని అందరూ ఆరోపించారు. ఇప్పటి వరకూ హత్యకు గల కారణాలు.. హత్య చేసిందెవరన్నది తేల్చలేకపోయారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారు. న్యాయ పోరాటం చేశారు. ఈ హత్య కేసులో ఆధారాలు లభించలేదా? లేక ఆధారాలను చెరిపేయడంతో విచారణలో అసలు వాస్తవాలు బయటకు రావడం లేదా? మరి దేశంలోనే అనేక క్లిష్టమైన కేసులను పరిష్కరించిన సీబీఐ వల్ల కూడా కాలేదంటే అసలు ఈ కేసు ఇక మూలనపడినట్లేనని అంటున్నారకు.
కూటమి ప్రభుత్వంలోనూ...
ఒక హత్య జరిగితే వెంటనే దానికి గల కారణాలను, నిందితులను ఎక్కడున్నా పట్టుకునే దర్యాప్తు అధికారులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీని ఎందుకు ఛేదించలేకపోతున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజానికి ఆధారాలున్నా.. ఏమాత్రం సాంకేతికమైన చిన్నపాటి క్లూ లు లభించినా దర్యాప్తు అధికారులు వదిలిపెట్టే ప్రశ్న ఉండదు. కానీ వివేకానంద రెడ్డి హత్య జరిగింది 2019లో. ఏడేళ్లుగా కుమార్తె డాక్టర్ సునీత పోరాటం చేస్తుంది. కానీ హత్యకు గల కారణాలు కూడా తెలియరాలేదు. ఇక నిందితులెవరూ లేరని, అందుకు తగిన ఆధారాలు లభించలేదని చెప్పడంతో వైఎస్ వివేకా హత్య కేసు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోనుంది.
అనేక ప్రచారాలున్నా...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనేక విషయాలు గత ఏడేళ్లుగా ప్రచారంలో ఉన్నాయి. వాటిలో నిజానిజాలు ఆ భగవంతుడికే తెలియాలి. వాటికి ఎటువంటి ఆధారాలు లేవు. ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయి ఇన్నేళ్లవుతున్నా కనీసం హత్యకు గల కారణాలను బయట ప్రపంచానికి తెలియకపోవడంతో ఇక దర్యాప్తు సంస్థలపై కూడా ప్రజలకు దురభిప్రాయం ఏర్పడే అవకాశముంది. అలాంటి వారికే న్యాయం జరగనప్పుడు ఇక సామాన్యులకు సరైన న్యాయం ఎందుకు జరుగుతుందన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. వైఎస్ వివేకానందరెడ్డిది సహజ మరణం కాదు.కానీ అందుకు గల కారణాలు ఇప్పటి వరకూ తెలియకపోవడం మాత్రం దురదృష్టకరమే.


Tags:    

Similar News