Jeevan Reddy : గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయిన జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నారు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్సయిందంటున్నారు.ఈ నెల 18 వ తేదీన జీవన్ బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు జగిత్యాలలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. గత కొన్నాళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డి రెండు రోజుల క్రితం ఇక పార్టీ మారేందుకు సమయం దగ్గర పడిందని వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి సీనియర్ నేత కావడంతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల...
జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. జీవన్ రెడ్డి తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ తర్వాత సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. తనకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన ఎప్పటి నుంచో తప్పుపడుతున్నారు. పార్టీ నాయకత్వంతో పాటు ఢిల్లీ నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. జగిత్యాలకు వచ్చిన మంత్రులందరికీ తన మొర వినిపించుకుంటూనే వస్తున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లోనూ ఛైర్మన్ పదవి తన వర్గానికి ఇవ్వకపోవడంపై ఇక పార్టీలో ఉండటం మంచిది కాదని, తప్పుకోవడం మంచిదని జీవన్ రెడ్డి భావించారు.
కేసీఆర్ సమక్షంలో...
దీంతో ఆయన బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్ లతో టచ్ లోకి వెళ్లారని తెలిసింది. జీవన్ రెడ్డి పార్టీలో చేరాలని కేసీఆర్ కూడా ఆహ్వానించడంతో తాజాగా ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి కాంగ్రెస్ పేరును తొలగించడంతో ఆయన పార్టీని వీడేది ఖాయమని స్పష్టమయింది. ముందుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసతున్నట్లు ప్రకటించడం, తన రాజీనామాకు దారితీసిన కారణాలను జీవన్ రెడ్డి వివరిస్తారని తెలిసింది. అనంతరం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుని అనంతరం జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారని సమాచారం.