Telangana : తండ్రి మృతి.. బాధను దిగమింగుకుని పరీక్షకు
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే తన తండ్రి మరణాన్ని దిగమింగుకుని ఒక విద్యార్థి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మోత్కూరులో మారెళ్ల ఎల్లయ్య ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఎల్లయ్యకు నిన్న రాత్రి ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
నేడు పదో తరగతి పరీక్షకు...
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నల్లగొండకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించగా తరలిస్తుండగా ఎల్లయ్య మృతి చెందాడు. అయితే ఎల్లయ్య కుమారుడు హర్షవర్ధన్ నేడు పదో తరతగతి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. అయితే కుటుంబ సభ్యులు, బంధువుల సూచనతో హర్షవర్ధన్ ఈరోజు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. తండ్రి మృతిని దిగమింగి పరీక్ష రాస్తున్నాడు హర్షవర్ధన్.