Revanth Reddy : మూసీ ప్రాజెక్టుతో ప్రయోజనాలు ఎన్నో.. పేదలకు వ్యతిరేకం కాదు

మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్‌పై వస్తున్న విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు

Update: 2026-03-14 01:56 GMT

మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్‌పై వస్తున్న విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ అభివృద్ధికి దోహదపడుతుందని, దాని ద్వారా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. పేదల ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యమని వస్తున్న ఆరోపణలను ఆయన తిరస్కరించారు. మూసీ నది ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన ఈ కార్యక్రమం ద్వారా సమాధానం ఇచ్చారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధితో ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు.

పేదలకు వ్యతిరేకం కాదు...
మూసీ నది తీరాభివృద్ధి ప్రాజెక్ట్ ద్వారా నగరంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పెరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో పెట్టుబడులు వచ్చి వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని వివరించారు. ఒక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ నిర్మాణం జరిగినా పెద్ద స్థాయిలో పెట్టుబడులు వస్తాయని, అలాంటి అవకాశాలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిందేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మెడికల్ టూరిజం, ఫార్మా, ఐటీ రంగాలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. అదే విధంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని ఆయన వ్యాఖ్యానించారు. పేదల ప్రయోజనాలకు వ్యతిరేకం కాదు అన్న రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్ట్ పేదల ప్రయోజనాలకు వ్యతిరేకంగా లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ భవిష్యత్ తరాల కోసం రూపొందిస్తున్నామని చెప్పారు. పేదల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లక్ష్యం కాదని ఆయన తెలిపారు.
నిర్మాణాత్మక సూచనలివ్వాలని...
పేదల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ ప్రాజెక్ట్ తీసుకువస్తే మళ్లీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భయంతో కొందరు ఈ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూసీ నది వెంట నివసించే ప్రజల సమస్యలపై తనకు సానుభూతి ఉందని చెప్పారు. అయితే నది దిగువన ఉన్న నల్గొండ ప్రాంత ప్రజల సమస్యలను కూడా గుర్తు పెట్టుకోవాలని అన్నారు. మూసీ ప్రాజెక్ట్‌లో 21 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి పనులకు సుమారు 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని సీఎం చెప్పారు. ఇందులో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ వ్యయం మొత్తం ఖర్చులో రెండు శాతం మాత్రమేనన్నారు. మూసీ నది తీరాల వెంట భారీ వాణిజ్య సముదాయాలు, వినోద సదుపాయాలు, జెయింట్ వీల్ వంటి నిర్మాణాలు ప్రతిపాదించినట్లు డీపీఆర్‌లో వివరించారు. ఈ ప్రాజెక్ట్‌పై అన్ని వర్గాల సూచనలు స్వాగతిస్తామని, డీపీఆర్‌ను అసెంబ్లీలో చర్చకు తీసుకువస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు కుట్ర సిద్ధాంతాలు ప్రచారం చేయకుండా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.


Tags:    

Similar News