డొక్కాకు ఇక పక్కా... ఆ ఎమ్మెల్యేకు టిక్కెట్ లేనట్లే

పద్దెనిమిది మంది అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రకటించింది. అయితే అందులో డొక్కా మాణిక్యవరప్రసాద్ పేరు లేదు

Update: 2023-02-21 06:26 GMT

వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ సీట్లను ఖరారు చేశారు. పద్దెనిమిది మంది అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రకటించింది. అయితే అందులో డొక్కా మాణిక్యవరప్రసాద్ పేరు లేదు. దీంతో డొక్కాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలోకి దించుతారని దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవికి ఈసారి టిక్కెట్ లేనన్నదేనని స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతుంది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరులు నిరాశలోకి వెళ్లిపోయారు. తమ ఎమ్మెల్యేను దూరం పెట్టడానికే డొక్కా మాణిక్యవరప్రసాద్ కు ఎమ్మెల్సీగా తిరిగి ఎంపిక చేయలేదన్నది వారికి అర్థమయిపోయింది.

పదవీకాలం ముగుస్తున్నా...
డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవీ కాలం వచ్చే నెల 29వ తేదీతో ముగియనుంది. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీతతో పాటు మరికొందరికి పదవులు రెన్యువల్ చేశారు. కానీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పేరు మాత్రం జాబితాలో కన్పించ లేదు. అంటే డొక్కాను శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దించాలన్న ఆలోచనతోనే జగన్ ఆయనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారు చేయలేదన్నది ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. డొక్కా అనుచరుల్లోనూ అదే ధీమా వ్యక్తమవుతుంది. ఇప్పటికే డొక్కాను తాడికొండ నియోజకవర్గంలో సమన్వయ కర్తగా పార్టీ హైకమాండ్ నియమించింది.
ప్రస్తుత ఎమ్మెల్యేపై...
నిజానికి ప్రస్తుత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై తాడికొండ నియోజకవర్గంలో వైసీపీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సొంత పార్టీ నేతలే ఆమెపై అధినాయకత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్యే నియోకవర్గంలోని గ్రామాల్లోనూ పర్యటించలేక పోతున్నారు. హైదరాబాద్ లో వైద్య వృత్తిలో ఉన్న ఉండవల్లి శ్రీదేవిని జగన్ తీసుకు వచ్చి తాడికొండ నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చారు. గత ఎన్నికల్లో జగన్ హవాతో ఆమె విజయం సాధించారు. విజయం సాధించినప్పటి నుంచి సొంత పార్టీ కార్యకర్తలతోనే ఆమె పొసగడం లేదు. దీంతో ఉండవల్లి శ్రీదేవిపై హైకమాండ్ కొంత ఆగ్రహంగానే ఉంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి కూడా సరిగా నిర్వహించలేకపోతున్నారు.
అందుకే రెన్యువల్ చేయలేదని...
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఎంపీ నందిగం సురేష్, పార్టీ సమన్వయకర్త డొక్కా మాణిక్యవరప్రసాద్ మధ్య పడటం లేదు. తాడికొండ నియోజకవర్గంలో మూడు వర్గాలుగా విడిపోయి హైకమాండ్ కు తలనొప్పిగా తయారయింది. నందిగం సురేష్ ది కూడా అదే ప్రాంతం కావడంతో ఆయన కూడా అక్కడ ఫోకస్ పెట్టడంతో ఉండవల్లి శ్రీదేవి అనేక సార్లు ఇబ్బందులు పడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవికి టిక్కెట్ ఇస్తే తాము సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సీటుపై ఎప్పటినుంచో అనుమానాలున్నాయి. ఆ అనుమానాలకు తగినట్లుగానే ఇప్పుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ కు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వకపోవడం కూడా కారణం అదేనంటున్నారు. జగన్ ఫైనల్ డెసిషన్ అదేనని, ఉండవల్లి శ్రీదేవికి ఈసారి టిక్కెట్ లేనట్లేనన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. శాసనసభకు పోటీ చేయడానికి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇక సిద్ధమవ్వాల్సి ఉంటుంది.



Tags:    

Similar News