వాసుపల్లి.... డెసిషన్ ఇక అదేనట

వాసుపల్లి గణేష్ కుమార్ సమన్వయకర్త పదవి నుంచి తప్పుకుని అధికార వైసీపీకి షాక్ ఇచ్చారు.

Update: 2022-06-05 05:49 GMT

వాసుపల్లి గణేష్ కుమార్ సమన్వయకర్త పదవి నుంచి తప్పుకుని అధికార వైసీపీకి షాక్ ఇచ్చారు. టీడీపీ నుంచి వచ్చిన తనకు వైసీపీలో విలువ లేకుండా పోతుందని వాసుపల్లి గత కొంతకాలంగా మదనపడుతున్నారు. ఇన్నాళ్లూ ఉత్తరాంధ్ర విజయసాయిరెడ్డి ఇన్ ఛార్జిగా ఉండటంతో పంటి బిగువున ఉన్నారు. ఇటీవల పార్టీ హైకమాండ్ ఇన్ ఛార్జిగా వైవీ సుబ్బారెడ్డిని నియమించింది. అప్పుడయినా తనకు ప్రాధాన్యత దక్కుతుందని వాసుపల్లి గణేష్ కుమార్ భావించారు. కానీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదని గ్రహించిన ఆయన ఇన్ ఛార్జి పదవికి రాజీనామా చేశారు.

రెండుసార్లు....
వాసుపల్లి గణేష్ కుమార్ 2014, 2019లో టీడీపీీ నుంచి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కొన్నాళ్ల క్రితం వైసీపీకి ఆయన మద్దతుదారుగా మారిపోయారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసి గెలవాలని ఆయన తొలుత భావించారు. అప్పటికే అక్కడ వైసీీపీ నేతలుగా ఉన్న ద్రోణంరాజు శ్రీవాత్సవ, రెహ్మాన్, మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్ కోలా గురువులు వేర్వేరు వర్గాలుగా ఇక్కడ ఉండి వాసుపల్లిక తలనొప్పిగా మారారు. ఎందుకు ఈ పార్టీలోకి వచ్చానా? అని ఆయన తల పట్టుకోని రోజంటూ లేదు.
గ్రూపుల గోలతో....
దీనికి కారణం వైసీపీలో వాసుపల్లికి వ్యతిరేకంగా ఉన్న గ్రూపులను హైకమాండ్ ప్రోత్సహిస్తుండటమే. కార్పొరేషన్ ఎన్నికలు వాసుపల్లికి మరింత అసంతృప్తిని రేగేలా చేశాయి. వాసుపల్లి టిక్కెట్ నిరాకరించినా ఇండిపెండెంట్లుగా పోటీ చేసి విజయం సాధించిన కార్పొరేటర్లు నేడు ఆయనపై తిరగబడుతున్నారు. ఇవన్నీ అనేకసార్లు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. దీంతో ఆయన ఇన్ చార్జి పదవికి రాజీనామా చేశారు. ఇది ప్రారంభం మాత్రమే.
తిరిగి టీడీపీలోకి..?
వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో ఇమడలేక పోతున్నారు. దీంతో ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నా చంద్రబాబు అందుకు అనుమతించడం లేదు. అయితే చివరి నిమిషంలోనైనా తనను ఆరదీస్తారని వాసుపల్లి ఆశిస్తున్నారు. వైసీపీలో ఉండి ఈ గ్రూపుల గోల భరించేకంటే టీడీపీలో చేరడమే మేలని వాసుపల్లి సన్నిహితులు భావిస్తున్నారు. ఆయనపై వత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయన త్వరలోనే మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.


Tags:    

Similar News