తెలుగు రాష్ట్రాలకు షాకింగ్ న్యూస్.. భవిష్యత్ కష్టమేనట

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు తెలుగు రాష్ట్రాలకు షాకింగ్ న్యూస్ చెప్పింది.

Update: 2026-01-30 02:20 GMT

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు తెలుగు రాష్ట్రాలకు షాకింగ్ న్యూస్ చెప్పింది. మేలుకోకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై ఆందోళనకరమైన నిజాలను బయటపెట్టింది. ముఖ్యంగా దేశంలో సంపద కలిగిన రాష్ట్రాలుగా పేరున్న తెలుగు రాష్ట్రాలు వేగంగా వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తోందని ఆర్‌బీఐ హెచ్చరించింది.. తాజాగా ఆర్‌బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రం మరో పదేళ్లలో ఏజింగ్ స్టేట్ జాబితాలోకి చేరనుంది. 2016లో రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య కేవలం 10.1 శాతంగా ఉండగా, 2026 నాటికి అది 12.5 శాతానికి చేరింది. ఇదే వేగం కొనసాగితే 2036 నాటికి రాష్ట్ర జనాభాలో 17.1 శాతం మంది వృద్ధులే ఉంటారని ఆర్‌బీఐ విశ్లేషించింది. అంటే, ప్రతి ఆరుగురిలో ఒకరు వయోధికులు ఉండబోతున్నారు.

పెరగనున్న పెన్షన్లు..
ఈ మార్పు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుతం పనిచేసే ప్రతి 100 మందిపై ఆధారపడే వృద్ధుల సంఖ్య 16గా ఉంటే, 2036 నాటికి అది 26కు పెరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వంపై పెన్షన్ల భారం, ఆరోగ్య రక్షణ ఖర్చులు భారీగా పెరుగుతాయి. మరోవైపు, పనిచేసే వయసున్న జనాభా తగ్గిపోవడం వల్ల పన్ను వసూళ్లు మందగించే ప్రమాదం ఉంది. తెలంగాణలో సంతానోత్పత్తి రేటు 1.5 కి పడిపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 శాతం కంటే చాలా తక్కువ.
ఆంధ్రప్రదేశ్‌లో మరీ దారుణం...
తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో మరింత వేగంగా ముసలితనంలోకి జారుకుంటోంది. 2036 నాటికి దేశంలో అత్యధిక వృద్ధులున్న రాష్ట్రాల్లో ఏపీ 4వ స్థానంలో, తెలంగాణ 7వ స్థానంలో నిలవనున్నాయి. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఈ దశకు చేరుకోగా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కూడా అదే బాటలో ఉన్నాయి. యువత సంఖ్య తగ్గుతుండటం వల్ల భవిష్యత్తులో సామాజిక, ఆర్థిక సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతకు సరైన నైపుణ్య శిక్షణ , ఉపాధి కల్పన, ఉత్పాదకత పెంచే సంస్కరణలు చేపట్టడంలో ఆలస్యం జరిగితే.. భవిష్యత్తులో పెరగనున్న వృద్ధ జనాభా అవసరాలను తీర్చడం ప్రభుత్వానికి పెను భారంగా మారుతుంది. ఇప్పటికైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకోకుంటే భవిష్యత్ మరింత ఆందోళనకరమేనని నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News