నారా వారి నిరాశ.. నిస్పృహ...అందుకేనా?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాపాన్ని మరోసారి ప్రజల మీదకే నెట్టేశారు. ఆయనలో నిరాశ నిస్పృహలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

Update: 2022-02-12 04:26 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాపాన్ని మరోసారి ప్రజల మీదకే నెట్టేశారు. ఆయనలో నిరాశ నిస్పృహలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆయన గంటన్నర పాటు పెట్టిన మీడియా సమావేశంలో ఆయన ఫ్రస్టేషన్ మొత్తం కన్పించింది. ప్రజల్లో చైతన్యం వచ్చి ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలన్నారు. మేధావులు ముందుకు వచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించాలని కోరారు. దీంతో చంద్రబాబు తన పార్టీ నేతలపై పూర్తిగా ఆశలు వదులకున్నట్లే కనిపిస్తుంది. ప్రత్యేక హోదాపై తాను మాట్లాడితే దానికి విలువ ఉండదు. అదే హోదాను తాను కాదన్నానన్న విషయం తనకు తెలియంది కాదు. అందుకే మేధావులను కోరుకుంటున్నారు.

విశ్వసనీయతపై...
తెలుగుదేశం పార్టీ అధినేతగా తాను ఇతర నేతలు చెప్పే మాటలు ప్రజలు విశ్వసించరేమోనన్న అనుమానం ఆయనకే కలిగినట్లుంది. అందుకే మేధావులు ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలని చంద్రబాబు పదే పదే కోరుతున్నారు. ఇటీవల మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం పెట్టి వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు కొంత కలసి వచ్చాయని భావిస్తున్నారు. అదే తరహాలో మిగిలిని మేధావులు కూడా ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యేక హోదా విషయాన్ని మేధావుల చేత చెప్పించాలని, సాధించడంలో వైసీపీ వైఫల్యాన్ని ప్రజల ముందు ఉంచనున్నారు.
గతంలోనూ ఇదే తరహాలో....
చంద్రబాబు గతంలో తటస్థులు, మేధావులను చేరదీసి రాజకీయంగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా పాత ఆలోచనలకు చంద్రబాబు మళ్లీ పదును పెట్టినట్లు కన్పిస్తుంది. మేధావులందరినీ కూడగట్టి జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులతో భవిష‌్యత్ లో ఎన్ని కష్టాలు ప్రజలకు రానున్నాయో చెప్పించాలని భావిస్తున్నట్లుంది. అందుకే ఆయన ఈసారి పార్టీ నేతల మీద కంటే మేధావులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నట్లే కన్పిస్తుంది. ఈ కారణంతోనే చంద్రబాబు పదే పదే మేధావులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాలని కోరుకుంటున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు...
నిజానికి చంద్రబాబు చెప్పే మాటలకు విశ్వసనీయత లేకుండా పోయింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరిస్తారని పార్టీ నేతలే అంగీకరిస్తారు. అధికారంలోకి వస్తే తాను మనిషిని కానని, కేస్ టు కేస్ రివ్యూ చేస్తానని చంద్రబాబు చెప్పడాన్ని కూడా పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు. చంద్రబాబు భయస్థుడు. అధికారుల మీద చేసిన పెత్తనం ప్రతిపక్ష పార్టీ నేతలపై చేయరు. ఆయన చూపంతా రాజకీయంపైనే ఉంటుందని, అందుకే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు రాజకీయంగా ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో మేధావులు, ప్రజల్లో ప్రభుత్వంపై తిరగబడాలని భావిస్తున్నారు.


Tags:    

Similar News