టైం జగన్ ది.. వెయిట్ చేయాల్సిన వంతు బాబుది

సినీ పరిశ్రమ విశాఖ రావాలని జగన్ ఆకాంక్షను టాలీవుడ్ పెద్దలు తీరుస్తారో లేదో తెలియదు కాని కొన్ని కండిషన్లకు అంగీకరించారు

Update: 2022-02-11 02:27 GMT

అవును.. చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే టాలీవుడ్ మీటింగ్ ఇంత చీప్ గా జరిగేదా? రోజంతా సమావేశాలు.. మధ్యలో బ్రేక్ లు.. బ్రేక్ ల సమయంలో యాడ్స్ ... ఇలా నిన్నటి రోజంతా టీవీలు హోరెత్తి పోయేవి. అందులో వచ్చింది టాలీవుడ్ దిగ్గజాలు. చిరంజీవిని పక్కన పెడితే...మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. వారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఎప్పుడూ అమరావతి వైపు తొంగి చూడలేదు. వారు రాజకీయాలను పట్టించుకోక పోవడమే ఇందుకు కారణం.

టాలీవుడ్ పై బాబు...
ఇక రాజమౌళి అమరావతి నగరాన్ని డిజైన్ చేేసేందుకు ఒకసారి చంద్రబాబును వచ్చి కలిశారు. అంతే తప్ప సినీ పరిశ్రమ విషయాలపై ఎవరూ చంద్రబాబు వద్దకు రాలేదు. చంద్రబాబు కూడా టాలీవుడ్ ను ఏపీకి రప్పించాలన్న యోచనలో అప్పడు లేరు. ఆ ఐదేళ్లు అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపైనే ఫోకస్ చేశారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులెవ్వరూ ఆయన చెంతకు రాలేదు. పవన్ కల్యాణ్ వచ్చినా ఆయన రాజకీయ నేపథ్యంతోనే రావడంతో టాలీవుడ్ కు ఆయన రాకకు సంబంధం లేదు.
హడావిడి లేకుండానే....
కానీ ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్ సమస్యలపైనే వీరు వచ్చారు. నలభై నిమిషాల్లోనే జగన్ సమావేశాన్ని ముగించారు. పెద్దగా హడావిడి చేయలేదు. జగన్ వద్దకు వచ్చి తమ రంగానికి చెందిన సమస్యలను ప్రస్తావించారు. వాటిని పరిష్కరించుకునేందుకు పెద్ద తారలే అమరావతికి దిగివచ్చాయి. కానీ జగన కూడా టాలీవుడ్ హీరోల డిమాండ్లను శ్రద్ధగా వింటూనే రాష్ట్రానికి మీ వల్ల ఉపయోగమేంటి? అన్న ప్రశ్నను కూడా సంధించారు. విశాఖలో ఎక్కువ షూటింగ్ లు జరగాలని జగన్ పరోక్షంగా చిత్ర పరిశ్రమను ఆదేశించినట్లే అయింది. ఇరవై శాతం షూటింగ్ లు ఏపీలో జరగాలన్నారు. 60 శాతం సినీ పరిశ్రమకు ఆదాయం తెచ్చిపెట్టే ఏపీని విస్మరించవద్దన్నారు. సినీ పరిశ్రమ విశాఖ రావాలని జగన్ ఆకాంక్షను టాలీవుడ్ పెద్దలు తీరుస్తారో లేదో తెలియదు కాని కొన్ని కండిషన్లు మాత్రం వారు అంగీకరించారని తెలిసింది.
యువ హీరోలు....
అంతేకాదు యూత్ లో క్రేజ్ ఉన్న మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలు జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. సినీ పరిశ్రమపై జగన్ కు ఉన్న అవగాహనను వారు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. రాజకీయాలకు ఇందులో చోటు లేకపోయినా ప్రభావం చేసే ఇద్దరు యువ హీరోలు జగన్ పొగడటం ఆయనకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. మరో వైపు చంద్రబాబుకు ఇబ్బంది కరంగా కూడా మారింది. ఇవన్నీ చూసి చంద్రబాబు కుమిలి కుమలి ఏడ్చి ఉండవచ్చు. ఏంచేద్దాం టైం జగన్ ది. వెయిట్ చేయాల్సిన వంతు చంద్రబాబుది.


Tags:    

Similar News