కరోనా మరణాల లెక్కల్లో అవకతవకలు, తాజా నివేదికల్లో సంచలన నిజాలు

కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల నష్టపరిహారం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను

Update: 2022-01-19 11:01 GMT

2020లో కరోనా ఫస్ట్ వేవ్ మొదలు.. ఇప్పటి వరకూ ఈ మహమ్మారి బారిన పడి మరణించినవారి సంఖ్య లక్షల్లో ఉంది. కానీ.. అధికారులు చూపించిన లెక్కలకంటే.. కరోనా మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు తాజా గణాంకాల్లో తెలుస్తోంది. తాజాగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాల గురించి సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని చెప్తున్నాయి.

కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల నష్టపరిహారం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారణ జరుపుతున్న సమయంలో పలు రాష్ట్రాలు కరోనా మరణాలపై నివేదికలను సుప్రీంకోర్టుకు సమర్పించాయి. ఆ నివేదికలను పరిశీలించగా.. కరోనా మరణాలపై తప్పుడు లెక్కలున్నట్లు తేలింది. ఈ గణాంకాల ప్రకారం.. తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువ మరణాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కరోనా మరణాల రేటు 7 నుంచి 9 రేట్లు అధికంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ రాష్ట్రం సమర్పించిన నివేదికను పరిశీలిస్తే.. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,993 కరోనా మరణాలు నమోదయ్యాయి. కానీ.. కరోనా పరిహారం కోసం 28,969 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 12,148 దరఖాస్తుదారులకు పరిహారం చెల్లించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చూపించిన లెక్కలకన్నా ఏడు రెట్లు మరణాల రేటు ఉంది. ఏపీలోనూ కరోనా మరణాల సంఖ్యలో ఇదే తేడా కనిపిస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం ఏపీలో కరోనా మృతుల సంఖ్య 14,471గా ఉండగా 36205 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు 11,464 దరఖాస్తుదారులకు పరిహారం మంజూరైందని వెల్లడించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అధికారిక కరోనా మృతులు 10,094 ఉండగా.. పరిహారం కోసం 89,633 దరఖాస్తులు వచ్చాయి. 58,843 దరఖాస్తులకు పరిహారం చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో కరోనాతో 141737 మంది చనిపోగా.. 2,13890 దరఖాస్తులు వచ్చాయి. 92,275 దరఖాస్తులకు పరిహారం చెల్లించినట్లు ఠాక్రే ప్రభుత్వం తెలిపింది. కాగా.. సెకండ్ వేవ్ లో కరోనాతో ఆస్పత్రుల్లో మరణించినవారి సంఖ్యకంటే.. బయట కరోనాతో మరణించినవారు ఎక్కువగా ఉన్నారని, అలా మరణించినవారి వివరాలను గణాంకాల్లో చేర్చకపోవడం వల్లే కరోనా మరణాల లెక్కల్లో ఈ అవకతవకలు కనిపిస్తున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి.




Tags:    

Similar News