T20 World Cup Finals : ఎవరి బలం ఏంటి..బలహీనతలేంటి? చివరకు కప్పు ఎవరిదంటే?
టీం ఇండియా ఆటగాళ్ల సమిష్టి కృషితో ఫైనల్స్ లోకి అడుగుపెట్టాం
టీం ఇండియా ఆటగాళ్ల సమిష్టి కృషితో ఫైనల్స్ లోకి అడుగుపెట్టాం. రేపు అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ లోనూ ఇదే సత్తా చూపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫీల్డింగ్ కొంత మెరుగైంది. అద్భుతమైన క్యాచ్ లతోనే ఇంగ్లండ్ ను సెమీ ఫైనల్స్ లో రాణించి ఫైనల్స్ లో అడుగు పెట్టాం. అంత వరకూ ఓకే. ఇక ముందున్నది అసలైన యుద్ధం. రేపు జరగనున్న మ్యాచ్ లో ఫీల్డింగ్ తో పాటు ఓపెనర్ల భాగస్వామ్యం కూడా బలంగా ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ పై చేసినట్లుగా 250కి పరుగులను చేయగలిగితేనే విజయం ముంగిట ఉంటుంది. అయితే మొదట బ్యాటింగ్ అవకాశం వస్తే 250 కంటే ఎక్కువ పరుగులు చేయాలి. అదే ఫీల్డింగ్ మొదట చేయాల్సి వస్తే 170 లోపు న్యూజిలాండ్ ను కట్టడి చేయాల్సి ఉంటుంది.
అన్నీ కలసి వచ్చి...
అన్నీ కలిసి వచ్చి సెమీ ఫైనల్స్ లో సగర్వంగా టీం ఇండియా అడుగు పెట్టగలిగింది. అయితే సూపర్ 8 లోనూ, సెమీ ఫైనల్స్ లోనూ టీం ఇండియా ఆట చూస్తే కొంత కలవరం అయితే కనిపిస్తుంది. సంజూ శాంసన్ ఫామ్ లోకి రావడం మంచి పరిణామమే కావచ్చు. కానీ అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు ఇంకా తడబడుతూనే ఉన్నారు. శివమ్ దూబె రన్ అవుట్ లు తరచూ అవుతుండటం ఇద్దరి మధ్య సమన్వయ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. శివమ్ దూబె మంచి హిట్స్ కొడుతున్న సమయంలో మొన్న రింకూ సింగ్, నిన్న హార్ధిక్ పాండ్యా కారణంగా రన్ అవుట్ అయ్యాడు. అందుకే రన్ అవుట్ల విషయంలో తగిన జాగ్రత్తలు, ఆటగాళ్ల మధ్య సమన్వయం కొసాగాల్సి ఉంటుంది.
పలు మార్పులు చేస్తే...
ఇక బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి భారీ పరుగులు ఇచ్చుకోవడం వల్ల కొంత ఇబ్బందికరంగా మారింది. కులదీప్ యాదవ్ ను దించితే కొంత ఫలితం ఉందన్న విశ్లేకులు చెబుతున్నారు. అదే సమయంలో అర్షదీప్ సింగ్ కూడా భారీగా పరుగులు ఇస్తున్నాడు. వైడ్స్ కూడా ఎక్కువగా వేస్తూ ప్రత్యర్థి స్కోరు పెరగడానికి కారణమవుతున్నాడు. అర్షదీప్ స్థానంలో మహ్మద్ సిరాజ్ కు ఫైనల్ లో అవకాశం కల్పిస్తే బాగుంటుందన్న సూచనలు కూడా వెలువడుతున్నాయి. బుమ్రా, హార్ధిక్ పాండ్యాకు తోడు సిరాజ్ తోడయితే కొంత న్యూజిలాండ్ ను ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. అలాగే అభిషేక్ శర్మ ను తప్పించి అతని స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తే మంచిదన్న సూచనలు కూడా వెలువడుతున్నాయి. మరి టీం ఇండియా న్యూజిలాండ్ పై ఎలా నెగ్గుతుందన్నది చూడాలి.