చంద్రబాబు కేసులో ముగిసిన వాదనలు...

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు రిమాండు రిపోర్టుపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి.

Update: 2023-09-10 09:41 GMT

చంద్రబాబు కేసులో ముగిసిన వాదనలు...

తీర్పు రిజర్వ్...

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు రిమాండు రిపోర్టుపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ఉదయం 7 గంటలకు వాదనలు ప్రారంభం కాగ, సీఐడీ తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హోరాహోరీగా వాదనలు వినిపించారు. చంద్రబాబును రిమాండుకు ఇవ్వాలని సీఐడీ కోర్టును కోరింది.

హోరాహోరీగా వాదనలు

చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఈ రోజు (ఆదివారం)ఉదయం నుంచి లంచ్ బ్రేక్ వరకు తన వాదన వినిపించారు. ప్రధానంగా 409 సెక్షన్, మరికొన్ని అంశాలపై దాదాపు 5 గంటల సేపు వాదనలు చేశారు. రిమాండ్ రిపోర్టులో భాష ఏమాత్రం బాగోలేదనీ, గమనించాలని, దాదాపు 4 అంశాలపై బలంగా వాదన వినిపించినట్లు తెలుస్తోంది. లంచ్ బ్రేక్ ముందు సీఐడీ అడ్వకేట్ తన వాదన ప్రారంభించినా, కొద్దిసేపటికే సమయం కావడంతో లంచ్ బ్రేక ఇచ్చారు. దీంతో లంచ్ తర్వాతన సీఐడీ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు.

చంద్రబాబు పేరు FIRర్‌లో ఎందుకు లేదని, నమోదు ఆలస్యానికి కారణాలు అని జడ్జి అడిగినట్లు తెలిసింది. చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయా అని జడ్జి ప్రశ్నించినట్లు తెలిసింది. ఇలా న్యాయమూర్తి అడిగే ప్రతీ ప్రశ్నకూ రిమాండ్‌ రిపోర్ట్‌ ద్వారా సీఐడీ తరపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ వివరాలు అందిస్తూ వచ్చారు.

వాదనలు జరుగుతున్నంత సేపు కోర్టు బయట ఉద్రిక్త పరిస్థితి ఉంది. భారీగా పోలీసులను మోహరించారు. కోర్టు వద్ద, విజయవాడలో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు కోరుకున్న(కోర్టులో వాదనలు ఉన్నందున) గవర్నర్ అపాయింట్మెంట్ రద్దు అయ్యింది.

ఏసీబీ కోర్టుకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు కొంతమంది నేతలు ఏసీబీ కోర్టు దగ్గర ఉన్నారు.

శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకూ ఈ విచారణ సాగింది. మధ్యలో రాత్రి 11 గంటలకు కొద్దిసేపు బ్రేక్ ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబుని భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, బాలకృష్ణ, బ్రాహ్మణి కలిసి మాట్లాడారు.

తెల్లవారుజాము 3 గంటల తర్వాత చంద్రబాబును విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి GGHకి తరలించారు. దాదాపు 10 మంది డాక్టర్ల టీమ్.. చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించింది. దాదాపు 45 నిమిషాలపాటూ వైద్య పరీక్షలు జరిగాయి. వైద్య పరీక్షల తర్వాత ఉదయం 4.30కి చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టుకి కాకుండా సిట్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఓ గంటపాటూ ఉంచిన అధికారులు ఆపై ఏసీబీ కోర్టుకి తరలించారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్‌లో రూ.241 కోట్లు అవినీతి జరిగిందనే అభియోగాలతో ఏపీ సీఐడీ పోలీసులు శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్టు చేశారు. ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 , 37 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే.

Tags:    

Similar News