20 చోట్ల మార్పు ? రేపే బిఆర్ఎస్ తొలి జాబితా!

దాదాపు 15 నుంచి 20 మంది సిట్టింగులను మార్చాలని బిఆర్ఎస్ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ తలపోస్తున్నట్టు తెలుస్తోంది

Update: 2023-08-20 10:15 GMT

20 చోట్ల మార్పు ?

రేపే బిఆర్ఎస్ తొలి జాబితా!

SK.ZAKEER

దాదాపు 15 నుంచి 20 మంది సిట్టింగులను మార్చాలని బిఆర్ఎస్ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ తలపోస్తున్నట్టు తెలుస్తోంది.ఈ సంఖ్య చివరి నిముషంలో 10 కి తగ్గవచ్చునని కూడా ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నవి.ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు,అవినీతి తదితర ఆరోపణల్లో కూరుకుపోయిన కళంకిత ఎమ్మెల్యేలను మార్చాలనుకుంటున్నారు.ఇలాంటి వారు కనీసం 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు ఒక సర్వేలో వెల్లడయ్యింది.అంత భారీ సంఖ్యలో కోత పెడితే పరిణామాలు ప్రతికూలంగా మారవచ్చునని అధికార పార్టీలో ఆందోళన వ్యక్తమవుతున్నది.అందువల్ల సాధ్యమైనంత మేరకు సిట్టింగుల మార్పును కుదించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. కాగా సర్వేల నివేదికల ఆధారంగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.తొలి జాబితాను సోమవారం ఉదయం కేసీఆర్ విడుదల చేయనున్నారు.

సిట్టింగులలో మార్పు చేయాలనుకుంటున్న నియోజకవర్గాలలో బెల్లంపల్లి,ముధోల్,బోథ్,ఆసిఫాబాద్, రామగుండం,పెద్దపల్లి,మానకొండూర్,వేములవాడ,జహీరాబాద్,ఉప్పల్,అంబర్ పేట్,ఆలంపూర్,అచ్చంపేట్,షాద్ నగర్,కల్వకుర్తి,నకిరేకల్,డోర్నకల్,స్టేషన్ ఘన్ పూర్,జనగామ,వరంగల్ తూర్పు,ఇల్లందు,వైరా,కొత్తగూడెం తదితర సీట్లు ఉన్నవి.వయోభారం రీత్యా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును తప్పించే అవకాశం ఉన్నది.ఆ నియోజకవర్గం నుంచి తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు టికెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.జిఎస్ఆర్ ట్రస్టు పేరిట ఏడాది కాలంగా హడావిడి చేస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు టికెట్టు రేసులో ఉన్నారు.కాగా బిఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తరపున కొత్తగూడెం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నందున ఆయనను డీకొనే బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ జరుగుతోంది.తొలి జాబితాలో కొత్తగూడెం సహా మరికొన్ని సెగ్మెంట్లు ఉండకపోవచ్చునని వినిపిస్తున్నది.ఖమ్మం,నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ బలోపేతం అవుతున్న సమాచారంతో ఆ రెండు జిల్లాల్లోని 22 అసెంబ్లీ నియోజకవర్గాలపై కేసీఆర్,కేటీఆర్,హరీశ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.ఆ కారణంగా అభ్యర్థుల ఖరారు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఇక ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి బదులుగా బండారు లక్ష్మరెడ్డి,వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కు బదులుగా రాజ్య సభ సభ్యుడు ఒద్దిరాజు రవిచంద్రను ఎంపిక చేసినట్టు తెలిసింది.స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య స్థానంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఖరారు చేసినట్టు తెలియవచ్చింది.నకిరేకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే లింగయ్య మార్పు విషయంలో సస్పెన్సు కొనసాగుతోంది.అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే వీరేశం టికెట్టు కోరుతున్నారు.కానీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై గెలిచి తర్వాత టిఆర్ఎస్ లో చేరిన 12 మంది సిట్టింగులకు టికెట్లు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు బిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.అందులో భాగంగానే లింగయ్య టికెట్టుకు డోకా లేదు.వీరేశంకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసినట్టు వార్తా కథనాలు వస్తున్నవి.వేముల వీరేశం ఎమ్మెల్యే టికెట్టుపైనే పట్టుబడుతున్నారు.అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నవి.జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మార్పు తప్పదని తేలిపోయింది.ముందుగా అక్కడి నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది.తర్వాత అనూహ్యంగా పల్లా రాజేశ్వరరెడ్డి పేరు తెరపైకి వచ్చింది.పోచంపల్లి మంత్రి కేటీఆర్ స్నేహితుడు.అనుచరుడు.పల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులున్నవి.ఉప్పల్ సీటు కోసం హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం అందుతోంది.

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఎవరికిస్తారు అన్న విషయమే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలో విశేష రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసు.అన్ని కోణాల్లో ఆలోచించాక కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నవి.కొన్ని చోట్ల తమ అభిప్రాయానికి విరుద్ధంగా అభ్యర్థి ఎంపిక జరగొచ్చుననే వార్తల ఆధారంగా కొంతమంది కార్యకర్తలు ఆందోళన బాట పడుతున్నారు.ఫలానా వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు కొందరైతే,ఫలానా వాళ్ళకి టికెట్ ఇస్తే ఓడగొడ్తాం అని బెదిరింపులకు ఇంకొందరు దిగుతున్నారు. కేసీఆర్ ప్రతీ క్షణం తెలంగాణ బాగును కోరే నాయకుడని ఆయన తీసుకొనే ప్రతీ నిర్ణయం అంతిమ లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ గెలుపని బిఆర్ఎస్ నాయకులంటున్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో విజయం సాధించాలంటే ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని అంటున్నారు. ఖచ్చితమైన సమాచారం ఆధారంగానే కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారని కార్యకర్తలు భావిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఉద్యమ నాయకత్వం,దశాబ్ద కాలం ముఖ్యమంత్రిగా పాలనానుభవం కలిగిన కేసీఆర్ నిర్ణయాల పట్ల అసంతృప్తి ఉంటే, దాన్ని పార్టీ అంతర్గత సమావేశాల్లో, కార్యకర్తల సమావేశాల్లో చర్చించాలి తప్ప,అనాలోచితంగా సోషల్ మీడియాలో పెట్టడం భావ్యం కాదని బిఆర్ఎస్ కార్యకర్తలంటున్నారు.

(Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)

Tags:    

Similar News