'తూటా' సాక్షిగా చంద్రబాబు నివాళి !

వెన్నుపూసలో తూటా క్షేమం.ఆ తూటాతోనే గద్దర్ భూమి లోపల సమాధిలో ఉన్నారు.ఆ తూటా ఏ తుపాకీ నుంచి వచ్చిందో,ఆ తుపాకీని వాడిందెవరో

Update: 2023-08-16 07:56 GMT

వెన్నుపూసలో తూటా క్షేమం.ఆ తూటాతోనే గద్దర్ భూమి లోపల సమాధిలో ఉన్నారు.ఆ తూటా ఏ తుపాకీ నుంచి వచ్చిందో,ఆ తుపాకీని వాడిందెవరో,తుపాకులు,తూటాలను సరఫరా చేసిన వారెవరో ఇప్ప్పటివరకు ఎవరికీ తెలియదు.తెలిసివాళ్ళు తమకు తెలుసనీ చెప్పరు.

పాతికేళ్ల కిందట గద్దర్ పై కాల్పులు జరిగినపుడు ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు.'ఆ కాల్పులకు,కాల్పులు జరిపిన బ్లాక్ టైగర్స్ కు నేను బాధ్యుడ్ని కాను' అని చంద్రబాబు మంగళవారం గద్దర్ కు నివాళి అర్పిస్తూ వివరణ ఇచ్చారు.

''గద్దర్ ఆశయాలను కొనసాగించేలా మా కార్యాచరణ ఉంటుంది'' అని టీడీపీ అధినేత చంద్రబాబు, గద్దర్ సమాధి దగ్గర అన్నారు.గద్దర్ ఆశయాలకు తెలుగుదేశంపార్టీ ఆశయాలకు అసలు ఎక్కడైనా పొంతన ఉన్నదా?ఎక్కడైనా పొసుగుతుందా?

చంద్రబాబు,గద్దర్ కు అసలు పోలిక ఏమిటి? ముందుగా తన హయాంలో గద్దర్ పై తూటాల వర్షం కురిపించింది ఎవరో,దాని వెనుక కథ ఏమిటో చంద్రబాబు చెప్పవలసి ఉంటుందని ప్రజా సంఘాలు కోరుతున్నవి.అప్పుడే గద్దర్ కు సరైన నివాళి అని ఆ సంఘాలు అంటున్నవి.

''గద్దర్,నేనూ అనేక పోరాటాల్లో కలిసి పాల్గొన్నాం.పీడిత ప్రజల సంక్షేమం కోసం గద్దర్ అనేక పోరాటాలు చేశారు.నేను కూడా బీసీ,ఎస్సీ, ఎస్టీల కోసం గద్దర్ తో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను'' అని చంద్రబాబు గుర్తు చేశారు.గద్దర్ తో కలిసి చంద్రబాబు ఎప్పుడు కలిసి పనిచేశారో ఎవరికీ తెలియదు.''ప్రజా యుద్ధనౌక గద్దర్ పై జరిగిన కాల్పుల ఘటనను నేను తీవ్రంగా ఖండించిన''ట్లు గుర్తు చేశారు.

'' ప్రజా చైతన్యంలో మొదట గుర్తొచ్చేది గద్దర్.ప్రజా ఉద్యమాలకు గద్దర్ ఊపిరిపోశారు.తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్ ది కీలక పాత్ర. గద్దర్ చనిపోయినా ఆయన స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుంది.గద్దర్ ఒక వ్యక్తి కాదు.ఆయనొక వ్యవస్థ.గద్దర్ స్ఫూర్తిని భావితరాలకు తీసుకు వెళ్ళాలి'' అని చంద్రబాబు అన్నారు.

బెల్లి లలిత సహా ఎంతో మంది ప్రజా ఉద్యమ నాయకులను,గాయకులను రాష్ట్ర ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తోందని గద్దర్ అప్పట్లో ఉద్యమించారు.1997లో టీడీపీ ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వానికి,సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా గద్దర్ 1997 ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు.పెద్ద ఎత్తున జనసమీకరణ జరిగింది. పోలీసులు ఆ నిరసనను అణిచివేయడానికి ప్రయత్నించారు.'తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు మరలా ఊపిరులూది ఉద్యమాలను నిర్మిస్తున్నందుకే గుర్తు 'తెలియని వ్యక్తుల' పేరిట పోలీసులే మఫ్టీలో వచ్చి కాల్పులు జరిపారని ప్రజల్లో బలంగా నాటుకుపోయిన ప్రచారం.ఆ ప్రచారం ఎన్నటికీ రివర్స్ కాదు.

గద్దర్ కు చంద్రబాబు నివాళి అర్పించడం వల్ల గద్దర్ ఆత్మకు శాంతి లభించదని చాలామంది నమ్ముతున్నారు.

    (Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)

Tags:    

Similar News