ప్రతిపక్షాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న తరుణంలో ఎన్డీఏను కూడా మరింత బలోపేతం చేయడానికి అమిత్ షా మొదలుపెట్టిన ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు అమిత్ షా నిన్న శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కాగా, ఉద్ధవ్ నుంచి ఎటువంటి సానుకూల ప్రకటన రాలేదు. అయితే, తాజాగా బిహార్ కు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం పాట్నాలో జరుగుతున్న ఎన్డీయే సమావేశాన్ని ఆ పార్టీ అధ్యక్షులు, కేంద్రమంత్రి ఉపేంద్ర కుష్వాహా బహిష్కరించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైఖరికి నిరసనగా ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ పార్టీ బిహార్ లో ఆర్జేడీతో జట్టు కట్టేందుకు ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి.