Weather Report : ముందుంది వడదెబ్బ... అదిరపోతుంది ఇక కాస్కోండి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చలికాలం పోయింది. వేసవి వచ్చింది. ఈసారి జనవరి నెల నుంచే వేసవి కాలం ప్రారంభమయినట్లే. ఇక ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత మరింత ఎక్కువయి మే నాటికి గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకోనున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరంలోనూ 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, మిగిలిన చోట్ల ఎండలు దంచి కొడుతున్నాయని, ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఒకరకంగా చలిగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలికాలం పూర్తిగా తొలిగిపోయినట్లేనని, ప్రజలకు ఇంక ఎండల తీవ్రత తప్పదని హెచ్చరిస్తున్నాయి.
నేడు పొడి వాతావరణం...
ఆంధ్రప్రదేశ్ లో నేడు కూడా పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో పగటి వేళ ఉష్ణోగ్రతలు ముప్ఫయి డిగ్రీలు దాటే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది వేసవి కాలం ముందే వస్తుందని భారత వాతావరణ శాఖ చేసిన సూచనలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, నలభై ఐదు డిగ్రీలు దాటే అవకాశం ఏప్రిల్ నెలాఖరుకే ఉండవచ్చన్న అంచనాలు వినపడుతున్నాయి. ఈ తరుణంలో వేసవి కాలంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు పడతారని వైద్యలు కూడా హెచ్చరిస్తున్నారు.
చలి పూర్తిగా కనుమరుగై...
తెలంగాణలోనూ చలి పూర్తిగా కనుమరుగైంది. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ముప్ఫయి డిగ్రీల ఉష్ణోగ్రతలు పగటి వేళ దాటేశాయని చెబుతున్నారు. ఈ తరుణంలో జనవరి చివరవారంలోనే ఇలా ఉంటే .. ఫిబ్రవరి మొదటి వారానికి ఎండల తీవ్రత మరింత ముదురుతుందని చెబుతున్నారు. మధ్యాహ్నం వేళ అయితే భానుడు భగభగ మండి పోతున్నాడు. ఎండల తీవ్రత అప్పుడే కనిపిస్తుండటంతో హైదరాబాద్ వంటి నగరంలో ప్రజలు తాగు నీటి ఇబ్బందులు కూడా మొదలయ్యాయి. మరొకవైపు ఈ ఏడాది అత్యధిక స్థాయిలో ఎండలు కాస్తాయని వాతావరణ శాఖ అధికారులు చేస్తున్న అంచనాతో ప్రజలు మరింత భయపడుతున్నారు.