Medaram : భక్తజనం పులకించింది.. వనదేవతలను చూసి తరించారు
తెలంగాణలో అతి పెద్ద ఆదివాసీ జాతర మేడారానికి భక్తజనం పోటెత్తారు
తెలంగాణలో అతి పెద్ద ఆదివాసీ జాతర మేడారానికి భక్తజనం పోటెత్తారు. నిన్నటికే దాదాపు అరవై లక్షల మంది భక్తులు వచ్చారని అంచనా వినపడుతుంది. సమ్మక్క, సారలమ్మ గద్దెలపైకి కొలువుదీరారు. దీంతో మేడారంలో భక్త జనం పులకించిపోయింది. వాయిద్యాల మోతలు, శివసత్తుల పూనకాలతో భక్త జనం ఎదురేగి సమ్మక్కను సాదరంగా ఆహ్వానించారు. పోలీసులు తుపాకీ వందనం సమర్పించడంతో సమ్మక్క గద్దెపై కొలువు దీరింది. దీంతో మేడారం జాతరలో కీలక ఘట్టం ముగిసినట్లయింది.
మూడు కోట్ల మందికి పైగా...
రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతరకు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఈసారి నాలుగు రోజుల ఈ జాతరకు మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసింది. పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకు వచ్చే దృశ్యాన్ని చూసేందుకు లక్షలాది మంది తరలి వచ్చారు. చాలా మంది ఎదురుకోళ్లు సమర్పించుకుంటున్నారు. చిలుకల గుట్ట నుంచి మేడారం వరకూ భక్తులు బారులు తీరారు.
మొక్కులు చెల్లించుకుంటూ...
దీంతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా మేడారం చేరుకుని తమ మొక్కులు చెల్లించుకన్నారు. ఈరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారం జాతరను సందర్శించనున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇప్పటికే నలుగురు వనదేవతలు గద్దెలపైకి చేరడంతో గొర్రెలను బలి ఇచ్చి వేలాదిమంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. అయితే ఎక్కడా ట్రాఫిక్ రద్దీ తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలను పోలీసులు తీసుకున్నారు. దర్శనానికి గంటల సమయం పడుతుంది. ఈరోజు, రేపు మరింత మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.