BJP : జగన్, కేసీఆర్ లకు బీజేపీ నుంచి ముప్పు ఉండదంతే.. అసలు సీక్రెట్ ఇదే

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ప్రాంతీయ పార్టీల జోలికి పెద్దగా వెళ్లదు

Update: 2025-09-04 09:00 GMT

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ప్రాంతీయ పార్టీల జోలికి పెద్దగా వెళ్లదు. తమ పార్టీలో విలీనం చేసుకునేందుకు ప్రయత్నించదు. అవసరమైన సమయంలో ప్రాంతీయ పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులను తమ పార్టీకి చేర్చుకుంటుంది కానీ, దేశంలో ప్రాంతీయ పార్టీలను తనలో విలీనం చేసుకునే ప్రయత్నం చేయదు. ఎందుకంటే బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ఓట్లు కలిగి ఉంటాయి. జాతీయ పార్టీలకు మించి ప్రాంతీయ పార్టీలకు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని భయపెట్టో, బతిమాలో తమకు మద్దతును తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప విలీనం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్నది ఇప్పటి వరకూ జరిగిన రాజకీయ పరిణామాలు చూసిన వారికి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.

ఇప్పటి వరకూ ఏ పార్టీనీ...
మహారాష్ట్రలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో భయపెట్టి శివసేనను చీల్చింది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ జోలికి పోలేదు. ఇక ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కేసులు బనాయించి జైల్లోకి తోసి ఢిల్లీలో అధికారంలోకి రాగలిగింది. అదే సమయంలో తమిళనాడులో డీఎంకే జోలికి కూడా పోలేదు. అక్కడ అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు విజయ్ పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోనూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలతో కూటమితో ఉన్నప్పటికీ అక్కడ కూటమికి ప్రత్యర్థిగా ఉన్న జగన్ జోలికి బీజేపీ వెళ్లడం లేదు. జగన్ మద్దతు ఎప్పటికైనా తమకు అవసరమని భావించడంతోనే పదకొండు నెలల నుంచి జగన్ పై ఉన్న కేసులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
ఇద్దరితోనూ సఖ్యతగానే...
తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కూడా అదే రకంగా దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అవసరమైతే పొత్తు పెట్టుకోవడం లేకుంటే తమకు అవసరమైన సమయంలో మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తుందే తప్ప తన పార్టీలో విలీనం చేసుకునే ప్రయత్నం చేయదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలని బీజేపీ గట్టిగా భావిస్తుంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని ఇప్పటికే నేతలు స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవసరమైన మద్దతు పొందేందుకు మాత్రమే ప్రయత్నిస్తుంది. ఆంద్రప్రదేశ్ లో జగన్ ను కానీ, తెలంగాణలో కేసీఆర్ ను కాని బీజేపీ తమకు వ్యతిరేకంగా మలచుకోదు. జగన్, కేసీఆర్ లు కాంగ్రెస్ కు శత్రువులు కావడంతో తమకు మిత్రులుగానే చూడాలనుకుంటుంది. అదే బీజేపీ స్ట్రాటజీ. రానున్న కాలంలోనూ ఏపీ, తెలంగాణలలో అలాగే ఆ పార్టీ రాజకీయంగా అడుగులు వేయనుంది. అందుకే జగన్, కేసీఆర్ లకు వచ్చే ముప్పు లేదన్నది వాస్తవం.



Tags:    

Similar News