మహారాజాకు ఎంత కష్టం...?

Update: 2018-06-01 12:55 GMT

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేయాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఎయర్ ఇండియాలో 76 శాతం వాటాలను అమ్మడానికి పౌర విమానయాన శాఖ బిడ్లను ఆహ్వానించింది. ఇందుకు గురువారం వరకు సమయం ఇచ్చారు. అయితే, ఒక్కరు కూడా వాటాల కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో అధికారులకు షాక్ తగిలింది. ఎయిర్ ఇండియా ప్రస్తుతం రూ.54,000 కోట్ల నష్టాల్లో ఉంది. గత కొన్నేళ్లుగా ఈ సంస్థ నఫ్టాలు, అప్పుల్లో కూరుకుపోయింది. వీటిని పూడ్చుకునేందుకు వాటాలు అమ్మాలని నిర్ణయించింది.

గడువు పెంచినా ముందుకు రాలేదు...

మొదట ఇండిగో, టాటా సన్స్, జెట్ ఎయిర్వేస్ సంస్థలు వాటాల కొనుగోలుకు మొగ్గు చూపాయి. మొదట బిడ్లు దాఖలు చేసేందుకు విమానయాన శాఖ మే 14వ తేదీ వరకు మాత్రమే సమయమిచ్చింది. అయితే, వాటాల కొనుగోలుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపక పోవచ్చని నిపుణులు సూచించడంతో ఈ గడువును మే 31 వరకు పెంచారు. అయినా కూడా ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. ఆసక్తిగల బిడ్డర్ల అనుమానాలు, ప్రశ్నలకు సంస్థ సమాదానాలు ఇచ్చింది. అయితే, వాటాల కొనుగోలుకు ఎవరూ ముందుకు రానందున త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని పౌర విమానయాన శాఖ ప్రకటించింది.

Similar News