బాబు మదిలో కొత్త ఐడియా... కార్యరూపం దాలిస్తే?

ఉద్యోగసంఘాల ఉద్యమం తర్వాత చంద్రబాబులో కొత్త ఆలోచన మొదలయింది.

Update: 2022-02-07 03:45 GMT

ఉద్యోగసంఘాల ఉద్యమం తర్వాత చంద్రబాబులో కొత్త ఆలోచన మొదలయింది. ఇప్పటి నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడంపై ఆయన సుదీర్ఘంగా సీనియర్ నేతలతో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల కూటమి కాకపోయినా ముందుగా దీనిని అఖిలపక్షంగా ఆందోళనలను ఏపీలో ఉద్యమం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కేవలం టీడీపీ మాత్రమే కాకుండా తమతో కలసి వచ్చే పార్టీలతో కలసి కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు.

చలో విజయవాడ సక్సెస్ తో....
ఇటీవల ఉద్యోగ సంఘాలు తలపెట్టిన చలో విజయవాడ సక్సెస్ అయింది. ప్రజలు కూడా వారికి అండగా నిలిచారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడలో నినదించారు. దీంతోనే జగన్ ప్రభుత్వం దిగివచ్చి వారితో చర్చలు జరిపి డిమాండ్లకు తలొగ్గింది. ఇదే తరహాలో ఉద్యమాలను చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ప్రజల భాగస్వామ్యం గురించి ఆలోచించేకంటే అధికార పార్టీ మినహా అన్ని పార్టీల కార్యకర్తలను సమాయత్తం చేసి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహించాలన్నది చంద్రబాబు ప్లాన్.
రెండేళ్లు మాత్రమే...
ఇక ఏపీలో రెండేళ్లు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు తప్పించి ఏపీలో అభివృద్ధి లేదని, ఇసుక నుంచి విద్యుత్తు వరకూ అనేక సమస్యలున్నాయి. పాలన చేతకాక జగన్ ఏపీని అప్పుల్లో ముంచేశారని టీడీపీ తరచూ ఆరోపిస్తున్నా ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడంలేదు. అందుకే భారీ ఉద్యమాన్ని చేసి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది.
అన్ని పార్టీలను కలుపుకుని....
ఎన్నికల పొత్తు అనే మాట లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలసి వచ్చే పార్టీలతో కలసి ఉద్యమాలను రూపొందించాలని చంద్రబాబు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిసింది. దీనికి టీడీపీ లీడ్ రోల్ పోషిస్తుంది. చలో విజయవాడలో ఉద్యోగ సంఘాలకు వామపక్షాలు సహకరించాయి. అదే తరహాలో ఉద్యమాన్ని నిర్వహించి ప్రభుత్వాన్ని ఇరుకుపెట్టాలన్నది చంద్రబాబు వ్యూహంగా ఉంది. బీజేపీ, జనసేనలు కలసి వస్తే ఇబ్బంది లేకుండా వారితో మంతనాలు జరిపే బాధ్యతను చంద్రబాబు సీనియర్ నేతలకు అప్పగించినట్లు తెలిసింది.


Tags:    

Similar News