నల్గొండలో నరబలి కేసు : మృతుడికి మతిస్థిమితం లేదు ?

పోలీసులు మొదట వివాహేతర సంబంధం కారణంగా హత్య జరిగి ఉండవచ్చని భావించారు. కానీ.. ఘటనా ప్రాంతంలో లభించిన తల ఆధారంగా మృతుడి ఫోటోను

Update: 2022-01-11 05:50 GMT

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లిలో నిన్న జరిగిన నరబలి.. స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు మొదట వివాహేతర సంబంధం కారణంగా హత్య జరిగి ఉండవచ్చని భావించారు. కానీ.. ఘటనా ప్రాంతంలో లభించిన తల ఆధారంగా మృతుడి ఫోటోను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించగా.. అతని తల్లిదండ్రులు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. తమ కొడుకుని ఖచ్చితంగా నరబలి ఇచ్చారని చెప్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్య పహాడ్ కు చెందిన రమావత్ శంకర్ నాయక్ కొడుకు రమావత్ యజేందర్ గా గుర్తించారు పోలీసులు. నిందితులు తల, మొండెంను వేరుచేసి.. తలను మాత్రం మహంకాళి అమ్మవారి కాళ్ల వద్ద వదిలివెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణలో భాగంగా మృతుడి ఫొటోను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. యజేందర్ ను గుర్తించిన తల్లిదండ్రులు రాత్రికి దేవరకొండ చేరుకున్నారు.

మృతుడి తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం.. యజేందర్ డిగ్రీ వరకూ చదువుకున్నాడు. ఆ తర్వాత మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో తల్లిదండ్రులు హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అయినప్పటికీ.. ఎలాంటి మార్పు లేకపోవడంతో కొడుకుపై ఆశలు వదిలేసుకున్నారు. ఆ తర్వాత యజేందర్ ఇంటికి రాలేదు. ఐదేళ్లుగా దేవాలయాల్లోనే ఉంటూ.. అక్కడ దొరికింది తింటూ తలదాచుకుంటున్నట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. కాగా.. యజేందర్ రెండు నెలలుగా ఇబ్రహీంపట్నం సమీపంలోని తుర్కయాంజిల్ వద్ద ఓ ఆలయంలో ఉంటున్నట్లు తెలిసింది.
తల్లిదండ్రులు చెప్పిన వివరాలతో ఇబ్రహీంపట్నం పోలీసులకు నల్గొండ జిల్లా పోలీసులు సమాచారం అందించారు. ఇబ్రహీంపట్నం నుండి చింతపల్లి వరకు అన్ని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. యజేందర్ ఇబ్రహీంపట్నంలో ఎప్పుడు బయల్దేరాడు ? ఎవరెవరిని కలిశాడు ? ఎవరెవరు యజేందర్ ను కలిశారు ? ఎక్కడెక్కడికి వెళ్లాడు ? తదితర వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తుర్కయాంజిల్-దేవరకొండ సమీపంలోని గుట్టల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు, నరబలులు జరిగిన అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


Tags:    

Similar News