Red Alert : నాలుగు గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్.. ఇళ్లలో నుంచి బయటకు రావద్దండి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు నేడు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు నేడు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మెరుపు వరదలు సంభవించే అవకాశముందని కూడా తెలిపింది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోనూ కుండపోత వర్షాలు పడతాయని చెప్పింది. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెల్లవద్దని సూచించింది. సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంటుందని, ఎవరూ సముద్ర స్నానాలకు దిగే ప్రయత్నం చేయవద్దని కూడా కోరుతున్నారు.
ఏపీలో అతి భారీ వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముందని కూడా పేర్కొంది. ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశముందని చెప్పింది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తెలంగాణలో ఐదు రోజులు వానలు...
తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, సంగారెడ్ి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.వనపర్తి, వికారాబాద్, సూర్యాపేట్, పెద్దపల్లి, నిజామాబాద్, నారాయణపేట, నల్లగొండ, నాగర్ కర్నూలు, మంచిర్యాల, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని తెలిపింది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు కురిసే ఐదు జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు.