Telangana : పంచాయతీ ఎన్నికల సందర్భంగా దారుణ హత్య

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి.

Update: 2025-12-10 06:03 GMT

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్–బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు గంటల ముందు ఈ సంఘటన చోటుచేసుకోవడంతో జిల్లా మొత్తం ఆందోళనకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం… రెండు గ్రూపుల మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. కొద్ది సేపటికే హింసాత్మక దాడిగా మారింది.

పరస్పరం దాడి చేసుకోవడంతో...
సుమారు 70 మంది ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో మరొక పార్టీ నేత అనుచరులపై దాడి చేసినట్లు చెబుతున్నారు. తీవ్ర గాయాలైన మల్లయ్యను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవతో పాటు మరో 15 మంది కూడా గాయపడ్డారు.దాడి వెనుక సర్పంచ్ ఎన్నికలో ఓటమి భయం ఉందనే కారణంతో కాంగ్రెస్ శ్రేణులు ఇలా చేసినట్లు బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. గ్రామంలో పరిస్థితి విషమించడంతో భారీగా పోలీసులు మోహరించారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, హింస మరింత పెరగకుండా చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News