Weather Report : ఈ చలికి గడ్డకట్ట పోతామా ఏందిరా అయ్యా?
దేశంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజుల నుంచి దేశంలో చలితీవ్రత పెరుగుతుంది
దేశంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజుల నుంచి దేశంలో చలితీవ్రత పెరుగుతుంది. దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. అనేక చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర భారత దేశం వెళ్లే వారు అలెర్ట్ గా ఉండాలి. రాజస్థాన్ తో పది డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సమయంలో వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో మంచు చరియలు విరిగిపడుతున్నాయి. చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ఉత్తర భారత దేశానికి వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అత్యల్ప ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ లోనూ చలిగాలుల తీవ్రత పెరిగింది. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతంలోనూ, గోదావరి పరివాహక ప్రాంతంలోనూ ఈ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. రాను రాను చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. అరకు, పాడేరు వంటి ప్రాంతాలయితే చలితీవ్రతకు గజ గజ వణికిపోతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పొగమంచు ఉండటంతో పాటు సాయంత్రం ఐదు గంటలకు చలి ప్రారంభమవుతుందని అంటున్నార. పర్యాటక ప్రదేశాలైన అరకు, పాడేరు, లంబసింగి వంటి ప్రాంతాల్లోనూ చలితీవ్రత పెరిగింది. మినుములూరు, పాడేరుల్లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ఇక్కడ...
తెలంగాణలో అయితే వేరే చెప్పాల్సిన పనిలేదు. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల తీవ్రతతో ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు. ఆదిలాబాద్, సిర్పూర్ వంటి ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోనూ కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమరం భీం జిల్లాలో 6.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 6.8 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 9, మంచిర్యాల జిల్లాకోటపల్లిలో 10.4 , సంగారెడ్డిలో 6.6, వికారాబాద్ లో 7.8, కామారెడ్డిలో 8.2, నిజామాబాద్ లో8.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లోనూ 8.4 డిగ్రీల ఉస్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి.