BRS : వరంగల్ లో కేసీఆర్ చెప్పిందేమిటి.. చేస్తున్నదేమిటి?
బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీకి చెందిన నేతలతో పాటు కుటుంబ సభ్యులే గండికొడుతున్నారు.
బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీకి చెందిన నేతలతో పాటు కుటుంబ సభ్యులే గండికొడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ అనేక మంది యాక్టివ్ గా లేరు. మొత్తం 119 నియోజకవర్గాల్లో పది నుంచి ఇరవై మంది నేతలు మాత్రమే రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. ఇక పార్టీ విషయానికి వస్తే అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ ను దాటి రావడం లేదు. వరంగల్ లో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో ఇక తాను జనంలో ఉంటానని చెప్పిన కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. ప్రజల్లోకి వచ్చేందుకు కూడా ఆయన ఇష్టపడటం లేదు. ఎక్కువగా వ్యవసాయంపైనే ఆయన మక్కువ చూపుతున్నారు. పార్టీ విషయాలను నేతలను పిలిచి మాట్లాడుతున్నప్పటికీ కేసీఆర్ స్వయంగా రాకపోవడం క్యాడర్ లో చర్చకు దారి తీస్తోంది.
కుటుంబ సభ్యుల ప్రమేయంతో...
ఇక అన్ని విషయాలను ఇద్దరే భుజానకెత్తుకున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావులు ఇద్దరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువగా గళం విప్పుతున్నారు. అలాగే ఆందోళన కార్యక్రమాల్లోనూ వారిద్దరే ముందు భాగాన ఉంటున్నారు. కుటుంబ సభ్యుల ప్రభావం పార్టీ ఓటమి పాలయిన తర్వాత కూడా మరొక నేతను ముందు పెట్టి పార్టీ కార్యక్రమాలను నడిపేందుకు వారు ఇష్టపడటం లేదు. దీంతో పాటు కల్వకుంట్ల కవిత ఇప్పటికే యాత్ర పేరిట జనంలోకి వెళుతున్నారు. సామాజికయాత్ర పేరుతో తెలంగాణలో ప్రారంభించిన యాత్ర ప్రభావం కూడా బీఆర్ఎస్ పై పడననుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు. ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ శ్రేణులకు ఒకింత నీరసంలో ఉండటం పార్టీకి మైనస్ అని చెప్పాలి.
అత్యధిక నియోజకవర్గాల్లో...
శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయి రెండేళ్లు దాటుతున్నప్పటికీ పార్టీ అధినేత కేసీఆర్ కార్యకర్తలను కలిసేందుకు ఇష్టపడకపోవడం కూడా పార్టీపై ఎఫెక్ట్ పడనుందని చెబుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన సమయంలో పార్టీని కేసీఆర్ వదిలేయడం కూడా నేతలు, క్యాడర్ లో ఒకరకమైన నిస్పృహను కలిగించింది. నేతలు కూడా ఎన్నికలకు ముందు వస్తే మంచిదని భావించి దాదాపు 90కి పైగా నియోజకవర్గాల్లో నేతలు బయటకు రాకపోవడంతో అక్కడ ఉన్న కారు పార్టీ క్యాడర్ కూడా కలుగులోకి వెళ్లిపోయినట్లే కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు వచ్చినా అప్పటికే ఓటర్లు ఫిక్స్ అయిపోయి ఉంటారని, నష్టం జరగక ముందే తీసుకోవాల్సిన చర్యల విషయంలో నానుస్తుండటం కూడా బీఆర్ఎస్ కు మరింత రాజకీయంగా నష్టం చేకూరుస్తుందంటున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ఫాం హౌస్ వదిలి జనంలోకి రావాలని కోరుతున్నారు.