Weather Report : ఈసారి మార్చిలోనే మాడు పగిలిపోతుందంట.. వాతావరణ శాఖ అప్ డేట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత చాలా వరకూ తగ్గింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత చాలా వరకూ తగ్గింది. ఉక్కపోత మొదలయింది. ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ చలితో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు ఉక్కపోతతో కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. కేవలం తెల్లవారు జామున, అర్ధరాత్రి సమయంలోనే చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపుగా ఇక చలితీవ్రత తగ్గినట్లేనని వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చేసింది. ఇక ఎండలు మొదలయినట్లేనని తెలిపింది. ఈ ఏడాది గత ఏడాది కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలోనే నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు.
ఉష్ణోగ్రతలు క్రమంగా...
ఆంధ్రప్రదేశ్ లోనూ చలిగాలుత తీవ్రత దాదాపుగా తగ్గిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే పొగమంచు మాత్రం ఉదయం ఎనిమిది గంటల వరకూ కొనసాగుతుందని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాత్రి పన్నెండు గంటల దాటిన తర్వాత మాత్రమే కొంత చలి అనిపిస్తుంది. అప్పటి వరకూ ఉక్కపోత వాతావరణం నెలకొని ఉంది. అరకు, పాడేరు, మినుములూరు, లంబసింగి వంటి ప్రాంతాల్లో కొంత చల్లటి వాతావరణం కొనసాగుతుంది. ఇక్కడ కూడా రానున్న రెండు, మూడు రోజుల్లో సాధారణ స్థితికి ఉష్ణోగ్రతలు చేరతాయని తెలిపింది. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
మంచు కురిసే వేళలో...
తెలంగాణలోనూ చలితీవ్రత చాలా వరకూ తగ్గింది. అయితే ఉదయం వేళల్లో మంచు కురుస్తుంది. మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం వేళ మాత్రం జాతీయ రహదారులపై ప్రయాణించే వారు పొగమంచుతో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు చలి కొంత తగ్గుతుందని, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కొంత చలిగాలులు వీస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.