BRS : ఫోన్ ట్యాపింగ్ తో మేనల్లుడిలో అనుమాన బీజం పడిందా?
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలో బీఆర్ఎస్ టాప్ లీడర్ల మెడకు చుట్టుకునే అవకాశముంది
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలో బీఆర్ఎస్ టాప్ లీడర్ల మెడకు చుట్టుకునే అవకాశముంది. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ వేగం పెంచింది. నిన్న మొన్నటి వరకూ పోలీసు మాజీ అధికారులను ప్రశ్నించిన సిట్ అధికారులు ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతల వైపు ఫోకస్ పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంతో పాటు దాదాపు ఎనిమిది గంటల పాటు విచారణ చేయడం, మరొకసారి విచారణ చేస్తామని చెప్పడంతో సిట్ పెద్ద తలకాయల ప్రమేయంపై కూడా విచారణను వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరీశ్ రావుకు మరో రెండు మూడు రోజుల్లో మరోసారి నోటీసులు జారీ చేసి విచారణ చేయనున్నారని తెలిసింది.
విచారణ సమయంలోనే...
హరీశ్ రావును విచారించే సమయంలోనూ సిట్ అధికారులు మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పడం ఒక మలుపు అని చెప్పాలి. 2018 తర్వాత దాదాపు సంవత్సరకాలం హరీశ్ రావు ఫోన్ ట్యాప్ అయినట్లు ఆయనకు ఆధారాలతో చూపించినట్లు సమాచారం. అంటే బీఆర్ఎస్ నేతలలో అనుమానాలు తలెత్తడానికి ఈ విచారణ దోహదపడుతుందని టాక్ నడుస్తుంది. హరీశ్ రావు తాను నమ్మలేదని చెబుతున్నప్పటికీ ఏదో ఒక మూల ఆయన తనపై అగ్రనేతలకు అనుమానం ఉందని భావించి కొంత తగ్గే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అంచనా. తనను కూడా అనుమానిస్తున్నారంటే పార్టీకి తాను విరగబడి ఎందుకు సేవ చేయాలన్న ఆలోచనలో హరీశ్ రావులో కలుగుతుందంటున్నారు.
తదుపరి నోటీసులు...
ఒక రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఆధారాలు.. కేసులు.. విచారణ.. పక్కన పెడితే తొలుత బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉండటమే కాకుండా అధికార పార్టీపై కాలు దువ్వుతున్న హరీశ్ రావుకు ఫోన్ ట్యాపింగ్ విచారణతో కళ్లెం వేసినట్లేనని అంటున్నారు. హరీశ్ రావు పైకి తనకు నమ్మకం లేదని చెబుతున్నప్పటికీ తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని అనుమానించి ఇంతకు ముందు స్పీడ్ ను చూపించకపోవచ్చంటున్నారు.ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి విచారణను ముఖ్య నేతలను చేస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. అంటే కేటీఆర్, కేసీఆర్‌లకు నోటీసులు అందే అవకాశాలు లేకపోలేదు. మొత్తం ఫోన్ ట్యాపింగ్ మరోసారి కారు పార్టీలో కలకలం రేపడం ఖాయమని అంటున్నారు.