Davos : ఎందుకురా అయ్యా.. ఈ ప్రచారం.. వచ్చినప్పుడు చెబితే సరిపోతుందిగా?
దావోస్ లో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని రెండు తెలుగు రాష్ట్రాలు డబ్బా కొట్టుకోవడం కొంతకాలంగా పరిపాటిగా మారింది
దావోస్ లో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని రెండు తెలుగు రాష్ట్రాలు డబ్బా కొట్టుకోవడం కొంతకాలంగా పరిపాటిగా మారింది. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలయిన ఈ జాతర రాష్ట్రాలు విడిపోయినా ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు పెట్టుబడుల విషయంలో పోటీ పడుతూ ప్రకటనలు చేస్తున్నాయి. వారు అధికారిక ప్రకటనలు ఏమీ చేయకపోయినా మీడియా ద్వారా లీకులిచ్చి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయని చెబుతున్నారు. కానీ చివరకు చూసే సరికి ఏ ఒక్క పరిశ్రమ గ్రౌండ్ అయ్యేంత వరకూ నమ్మకం కలగడం లేదు. నాడు జగన్ అంతే. నేడు చంద్రబాబు అంతే. నాడు కేటీఆర్ అంతే.. నేడు రేవంత్ అంతే.
కొన్నేళ్లుగా ఇదే తంతు...
నిజానికి గత కొన్నేళ్లుగా జరుగుతున్న దావోస్ పర్యటనలతో వచ్చిన ఒప్పందాలు అమలయి ఉంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగం ఉండేది కాదు. కోట్ల ఉద్యోగాలు భర్తీ అయ్యేవి. రెండు తెలుగు రాష్ట్రాలూ పరిశ్రమలతో నిండిపోయేవి. అవగాహన ఒప్పందాలు అవగాహన వరకే ఉంటున్నాయి. తీరా ఏపీలో కానీ, తెలంగాణలో కానీ పరిశ్రమ తెరిచే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పాలి. ఒకరకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, విభజన తర్వాత కానీ తెలంగాణలోనే కొద్దో గొప్పో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అంతే తప్ప 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఏవైనా ఏర్పాటయ్యాయా? ఉపాధి అవకాశాలు పెరిగాయా? అన్నది మాత్రం ఇంకా మిలియన్ డాలర్ ప్రశ్న.
నిరుద్యోగం మాత్రం...
తాజాగా ఏపీ అడ్వాంటేజీ పేరిట ఆంధ్రప్రదేశ్, రైజింగ్ పేరిట తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయన్న ప్రచారంలో ఎంత వరకూ నమ్మకం ఉందో తెలియదు. లక్ష ఉద్యోగాలంటూ ప్రచారంతో ఊదరగొడుతున్నారు. అలాగే ప్రతిష్టాత్మకమైన సంస్థలతో ఒప్పందాలు జరిగాయంటున్నారు. కానీ ఎప్పటి లాగానే ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు వస్తాయా? నిరుద్యోగ సమస్య తీరుతుందా? అనే ప్రశ్నకు మాత్రం నేతల నుంచి సమాధానం లేదు. భారీ పెట్టుబడులంటూ తెలంగాణ ప్రభుత్వం నుంచి లీకులు వస్తున్నాయి. ఇంతకీ ఎన్ని పరిశ్రమలు వస్తాయో? ఎంత మందికి ఉద్యోగాలు వస్తుందో తెలియదు కానీ మళ్లీ వచ్చే ఏడాది దావోస్ పర్యటన వరకూ ఈ ఊసే ఇక వినిపించదు. అదీ మనోళ్ల పరిస్థితి అంటూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున సెటైర్లు వినపడుతున్నాయి. ఇప్పటికైనా వాస్తవ రూపంగా ఆలోచించి ప్రచారం చేసుకుంటే మంచిదని, లేకుంటే వికటిస్తుందన్న హెచ్చరికలు రెండు రాష్ట్రాల నేతలకు వినిపిస్తున్నాయి.